ఎల్ ఐసీ షేర్ల ప్రైస్ బ్యాండ్ 902-949 రూపాయ‌లు

Update: 2022-04-27 10:03 GMT

అధికారికం. ఇన్వెస్ట‌ర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీవో తేదీల‌ను కేంద్రం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఎల్‌ఐసీ ఐపీఓ వచ్చే నెల 4న ప్రారంభమై 9న ముగియ‌నుంది. ఈ మెగా ఐపీఓలో భాగంగా ఒక్కో షేరు ప్రైస్‌ బ్యాండ్‌ను రూ.902-949గా నిర్ణ‌యించారు. ఈ లెక్కన కంపెనీ ఈక్విటీలో ప్రభుత్వం అమ్మకానికి పెడుతున్న 3.5 శాతం షేర్లకు గ‌రిష్ట ధ‌ర 949 రూపాయల‌ చొప్పున లెక్కిస్తే 21,000 కోట్ల రూపాయ‌ల వరకు సమకూరే అవకాశం ఉంది. యాంకర్‌ ఇన్వెస్టర్లు మాత్రం మే 2వ తేదీనే షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ ఐసీ పాలసీదారులకు 10 శాతం రిజర్వ్ చేశారు. ఈ ఐపీఓలో పాలసీదారులకు 10 శాతం, ఉద్యోగులకు 5 శాతం, రిటైల్‌ మదుపరులకు 35 శాతం షేర్లను ఎల్‌ఐసీ రిజర్వ్‌ చేసింది. ఈ షేర్లను ప్రత్యేక రాయితీ కింద వారికి కేటాయించనుంది. పాలసీదారుల కు కేటాయించే 2.21 కోట్ల షేర్లలో ఒక్కో షేరుపై రూ.60 చొప్పున, ఉద్యోగులు, రిటైల్‌ మదుపరులకు రూ.40 చొప్పున డిస్కౌంట్‌ ఇస్తారు. ఈ ఐపీఓపై ఆసక్తి ఉన్న మదుపరులు కనీసం 15 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్పర్‌ ప్రైస్‌ బ్యాండ్ 949 రూపాయ‌ల వద్ద లిస్టయినా ఎల్‌ఐసీ మార్కెట్‌ క్యాప్‌ రూ.6.01 లక్షల కోట్లతో దేశంలో ఐదో అతిపెద్ద, ప్రపంచంలో 186వ అతిపెద్ద మార్కెట్‌ క్యాప్‌ కంపెనీ అవుతుంది.

ఇష్యూకి మంచి ఆదరణ లభించి ప్రీమియంతో లిస్టయితే ఎల్‌ఐసీ మార్కెట్‌ క్యాప్‌ తేలిగ్గా ఇన్ఫోసిస్ ను మించిపోతుందని లెక్క‌గ‌డుతున్నారు. ఎల్‌ఐసీ ఈక్విటీలో ఐదు శాతం వాటా విక్రయం ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.65,000 కోట్ల వరకు సమీకరించాలని ప్రభుత్వం భావించింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ దెబ్బతినడంతో ప్రభుత్వం ఆ ప్రయత్నం విరమించుకుంది. ఇప్పుడు 3.5 శాతం ఈక్విటీ విక్రయం ద్వారా రూ.21,000 కోట్లతో సరిపెట్టుకునేందుకు సిద్ధమైంది. ఎల్‌ఐసీ షేర్ల జారీ ధర ఖరారవడంతో అప్పుడే అనధికార గ్రేమార్కెట్లో ఈ షేర్లపై ఆసక్తి పెరిగింది. ఒక్కో షేరు ప్రస్తుతం జారీ ధర కంటే పది శాతం వరకు ప్రీమియంతో 1,043 రూపాయ‌ల వద్ద ట్రేడవుతోంది. ఐపీఓ తేదీ దగ్గర పడేసరికి ప్రీమియం మరింత పెరుగుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నారు.

Tags:    

Similar News