ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ షేర్లు తొలి రోజే దుమ్మురేపాయి. కంపెనీ ఐపీవో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఇప్పుడు ఈ కంపెనీ షేర్ల లిస్టింగ్ కూడా అలాగే సంచలనం నమోదు చేసింది. మంగళవారం నాడు ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ షేర్లు బిఎస్ఈ, ఎన్ఎస్ఈ ల్లో లిస్ట్ అయ్యాయి. ఐపీవో ద్వారా ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ 11607 కోట్ల రూపాయల నిధులు సమీకరించింది. ఒక్కో షేర్ ను ఇన్వెస్టర్లకు గరిష్ట ధర 1140 రూపాయల వద్ద కేటాయించింది. ఆఫర్ ధర తో పోలిస్తే ఏకంగా 50 శాతం ప్రీమియం తో ఈ కంపెనీ షేర్లు తొలుత 1715 రూపాయల వద్ద లిస్ట్ అయ్యాయి. ఈ కంపెనీ ఐపీవో కు ఏకంగా 4 . 4 లక్షల కోట్ల రూపాయల బిడ్స్ వచ్చాయి. కంపెనీ 11607 కోట్ల రూపాయల సమీకరణకు ఇంత పెద్ద మొత్తంలో బిడ్స్ రావటం పెద్ద సంచలనం అని చెప్పాలి.
అంతే కాదు దేశ ఐపీవో చరిత్రలో ఎల్ జీ ఐపీఓకు వచ్చిన బిడ్స్ ఒక రికార్డు . ఇప్పటి వరకు గత ఏడాది ఐపీవో కు వచ్చిన బజాజ్ హొజింగ్ ఫైనాన్స్ పేరిట అత్యధిక మొత్తానికి బిడ్స్ దక్కించుకున్న రికార్డు ఉంది. ఈ కంపెనీ ఐపీవో కి 3 .2 లక్షల కోట్ల రూపాయల బిడ్స్ వచ్చాయి. ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ ఐపీఓకు ఇన్వెస్టర్లు మొదటి నుంచి మంచి ఆసక్తి చూపించారు. కంపెనీ ట్రాక్ రికార్డు తో పాటు దీనిపై ఉన్న బజ్ కూడా ఈ రికార్డు లకు కారణం అయింది. అదే సమయంలో లిస్టింగ్ సమయంలో కూడా అదే జోష్ కనపడింది.
ఎల్ జీ కంటే ఒక్క రోజు ముందు ఐపీఓకు వచ్చిన దిగ్గజ టాటా గ్రూప్ కు చెందిన కంపెనీ టాటా కాపిటల్ షేర్లు సోమవారం నాడు లిస్ట్ అయ్యాయి. అయితే ఈ షేర్లు మాత్రం ఇన్వెస్టర్లకు పెద్దగా లిస్టింగ్ లాభాలు ఇవ్వలేదు అనే చెప్పాలి. కేవలం ఆఫర్ ధర కంటే నాలుగు రూపాయల లాభంతో 330 రూపాయల వద్ద నమోదు అయ్యాయి. ఈ కంపెనీ ఒక్కో షేర్ ను 326 రూపాయలతో ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. టాటా కాపిటల్ తో పోలిస్తే ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ ఇన్వెస్టర్లకు మంచి లిస్టింగ్ లాభాలు అందించింది అనే చెప్పాలి. ఎల్ జీ షేర్లు బిఎస్ఈ లో ఉదయం 10 .20 గంటలకు 1652 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి ఈ షేర్లు ఏ ధర వద్ద సెటిల్ అవుతాయో చూడాలి.