అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్

Update: 2021-01-20 17:07 GMT

ఆ క్షణం రానే వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ను వీడారు. అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ భారతీయ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్..ఆ తర్వాత జో బైడెన్ లు ప్రమాణ స్వీకారం చేశారు. జో బైడెన్ అమెరికా 46వ అధ్యక్షుడు. ఈ కార్యక్రమానికి క్లింటన్‌, జార్జ్‌ బుష్‌, ఒబామా కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. లేడీ గాగా జాతీయ గీతాలాపానతో ఈ కార్యక్రమం మొదలయ్యింది. ఆ తర్వాత బైడెన్‌ సతీమణి జిల్‌ బైడెన్‌ ప్రసంగించారు. అనంతరం ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌తో సుప్రీంకోర్టు న్యాయమూర్తి సోనియా సోటోమేయర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.

ట్రంప్ మద్దతుదారులతో ముప్పు ఉందనే సమాచారంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి భారత ప్రభుత్వం తరపున దేశ రాయభారి తరన్ జిత్ సింగ్ హాజరయ్యారు. ఎన్నో అవాంతరాలను అధిగమించి జో బైడెన్ సాఫీగా అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయనకు ఈ పదవి రాబోయే రోజుల్లో ఎన్నో సవాళ్ళు విసరనుంది. తొలి ప్రాధాన్యం అమెరికాను వణికిస్తున్న కరోనా వైరస్ ను అదుపులోకి తేవటమే కానుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జో బైడెన్ టీమ్ ఓ కార్యాచరణ సిద్ధం చేసుకుని పెట్టింది. అయితే ఇది ఎంత విజయవంతంగా అమలు అవుతుందో వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News