స్టాక్ మార్కెట్లకు జో బైడెన్ జోష్

Update: 2020-11-09 12:14 GMT

దేశీయ స్టాక్ మార్కెట్లు దుమ్మురేపాయి. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నిక ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కన్పించింది. ముఖ్యంగా ఐటి రంగానికి సానుకూల పరిస్థితులు ఉండొచ్చనే అంచనాల మధ్య మదుపరులు భారీ ఎత్తున కొనుగోళ్లు చేశారు. దీంతో సోమవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్లు లైఫ్ టైమ్ గరిష్ట స్థాయిని చేరాయి. సోమవారం నాడు మార్కెట్లో ప్రధానంగా ఐటి, ఫైనాన్షియల్ విభాగాల షేర్లు లాభపడ్డాయి. దీనికి తోడు దేశీయ ఆర్ధిక వ్యవస్థ క్రమక్రమంగా గాడిన పడుతుందనే సంకేతాలు వెలువడటం కూడా ఇన్వెస్టర్లలో ఉత్సాహన్ని నింపింది. సోమవారం నాడు ప్రారంభం నుంచి మార్కెట్లో గ్రీన్ లోనే కొనసాగాయి. ఒక దశలో సెన్సెక్స్ 42,645 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 704 పాయింట్ల లాభంతో 42,597 పాయింట్ల వద్ద ముగిసింది.

నిఫ్టీ 197 పాయింట్ల లాభంతో 12,461 పాయింట్లకు చేరింది. కరోనాతో ఆర్ధిక వ్యవస్థ కుదేలు అయిన ఈ ఏడాదిలోనే దేశీయ మార్కెట్లు రెండుసార్లు ఆల్ టైమ్ రికార్డు స్థాయిలకు చేరుకోవటం విశేషం. జనవరిలో తొలుత కొత్త రికార్డులను నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు ..ఇప్పుడు నవంబర్ 9న మరో కొత్త రికార్డులను నమోదు చేశాయి. జో బైడెన్ గెలుపు అమెరికా మార్కెట్లకు తప్ప ప్రపంచంలోని అన్ని మార్కెట్లకు సానుకూలమే అని బిలియనీర్, ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ మోబియస్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. ఆయన చెప్పినట్లు ప్రపంచ వ్యాప్తంగా పలు మార్కెట్లు కొత్త కొత్త రికార్డులను చేస్తున్నాయి. ప్రస్తుతానికి అమెరికా మార్కెట్లు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నాయి.

Tags:    

Similar News