రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం నాడు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ద్వీతీయార్ధంలో జియో 5జీ సేవలను అందుబాటులోకి తేనుందని తెలిపారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు.దేశీయంగా అభివృద్ధి చేసిన నెట్ వర్క్, హార్డ్ వేర్, టెక్నాలజీ కాంపోనెంట్స్ తోనే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. 5జీని సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు వేగంగా విధాన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అదే సమయంలో 5జీ సర్వీసులను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎయిర్ టెల్ అధినేత సునీల్ మిట్టల్ మాత్రం భారత్ లో 5జీ రెడీ అవటానికి వచ్చే రెండు, మూడేళ్ళ సమయం పడుతుందని చెప్పటం విశేషం.కరోనా కారణంగా డిజిటల్ వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపారు. దేశీయ టెలికం రంగంలోకి ప్రవేశించిన అనతికాలంలోనే జియో ఎన్నో రికార్డులను నమోదు చేసిన విషయం తెలిసిందే. ముఖేష్ అంబానీ తాజా ప్రకటన ప్రకారం దేశంలో తొలి 5జీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చే కంపెనీగా జియో నిలవనుంది.