ఏప్రిల్ 30 వరకూ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం

Update: 2021-03-23 14:26 GMT

వేసవి నాటికి విమానయాన రంగం కోవిడ్ పూర్వ స్థితికి చేరుకుంటున్న తరుణంలో ఊహించని షాక్. మళ్లీ పలు దేశాల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో విమానయాన రంగం మరోసారి దారుణంగా దెబ్బతినబోతుంది. కేంద్ర పౌరవిమానయాన శాఖకు చెందిన నియంత్రణా సంస్థ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయ వాణిజ్య ప్యాసింజర్ విమాన సేవలపై నిషేధాన్ని ఏప్రిల్ 30 వరకు పొడిగించారు. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమానాల సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పటికే పరిమిత సంఖ్యలో నడుస్తున్న విమాన సర్వీసులు మాత్రం యధావిధిగా కొనసాగనున్నాయి. గత ఏడాది జూలై నుంచి ఎంపిక చేసిన దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా ''ఎయిర్ బబుల్''ను ఏర్పాటు చేసి, విమానాలను నడుపుతున్నారు. బ్రిటన్, అమెరికా, యూఏఈ, కెన్యా, భూటాన్ తదితర దేశాలతో ఇటువంటి ఏర్పాట్లు జరిగాయి. మంగళవారం డీజీసీఏ విడుదల చేసిన సర్కులర్ ప్రకారం, డీజీసీఏ ప్రత్యేకంగా అనుమతించిన ఇంటర్నేషనల్ సర్వీసులు, అన్ని కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదు.

Tags:    

Similar News