అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని కేంద్రం మరోసారి పొడిగించింది. వాస్తవానికి డిసెంబర్ 15 నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులకుగ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేగటంతో ఈ నిర్ణయాన్ని మార్చుకున్నారు. గురువారం నాడు కొత్తగా షెడ్యూల్డ్ అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని 2022 జనవరి 31 వరకూ పొడిగిస్తూ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సర్కులర్ జారీ చేసింది. ఇప్పటికే ఆమోదించిన అంతర్జాతీయ విమాన సర్వీసులు, కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదని తెలిపారు. పలు దేశాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉండటంతో విమాన సర్వీసులపై ఆంక్షలు విధిస్తున్నారు.
లేకపోతే పలు కఠిన నిబంధనలతో ఆయా దేశాల్లోకి ప్రయాణికులను అనుమతిస్తున్నారు. అదే సమయంలో కేంద్రం రిస్క్ దేశాల జాబితాను గురువారం నాడు విడుదల చేసింది. రిస్క్ దేశాలుగా గుర్తించిన ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు అదనపు నిబంధనలు పాటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికాతోపాటు బ్రెజిల్, బోట్స్ వానా, చైనా, ఘనా, మారిషస్, న్యూజిలాండ్, జింబాబ్వే, టాంజానియా, హాంకాంగ్, ఇజ్రాయెల్, యునెటైడ్ కింగ్ డమ్ తోపాటు యూరప్ దేశాలు అన్నీ ఈ జాబితాలో ఉన్నాయి.