అంతర్జాతీయ విమానాలపై నిషేధం జూన్ 30 వరకూ

Update: 2021-05-28 12:37 GMT

అంతర్జాతీయ విమాన ప్రయాణం అగమ్యగోచరం. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎప్పుడు తగ్గుముఖం పడుతుందో..మళ్ళీ సాధారణ ప రిస్థితులు ఎప్పటికి నెలకొంటాయో ఎవరికీ తెలియని పరిస్థితి. దీంతో భారత్ కూడా ఎప్పటికప్పుడు అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులపై నిషేధాన్ని పొడిగిస్తూ పోతుంది. ఇప్పుడు మరోసారి అదే పనిచేసింది. వాస్తవానికి దేశంలో కరోనా రెండవ దశ తీవ్రంగా ఉండటంతో పలు దేశాలు ఇప్పటికే భారత వాణిజ్య ప్రయాణికులపై ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం మే నెలాఖరు వరకే దేశంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం ఉంది. దీంతో ఈ గడువును జూన్ 30 వరకూ పొడిగిస్తూ డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో అంతర్జాతీయ కార్గో విమానాలకు ఈ నిషేధం వర్తించదు.

దీంతోపాటు ఎంపిక చేసిన రూట్లలో డీజీసీఏ ఆమోదంతో వాణిజ్య షెడ్యూల్డ్ విమానాలను అనుమతిస్తారు. వాస్తవానికి ఈ వేసవి నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని అందరూ భావించారు. స్వయంగా కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సైతం ఇదే విషయాన్ని పలుమార్లు బహిరంగంగా ప్రకటించారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ కరోనా రెండవ వేవ్ విజృంభణతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. విచిత్రం ఏమిటంటే ఒకప్పుడు కరోనాతో అల్లకల్లోలం చవిచూసిన అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు దేశాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నాయి.

Tags:    

Similar News