కరోనా తొలి, రెండవ దశలతో పోలిస్తే మూడవ దశ నుంచి దేశ ప్రజలకు చాలా త్వరగానే ఊరట లభిస్తుందనే చెప్పొచ్చు. ఇప్పటికే దేశవ్యాప్తంగా కేసులు గణనీయంగా తగ్గగా..ఫిబ్రవరి నెలాఖరు నాటికి మూడవ దశ ఇంచుమించు ముగింపు దశకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దేశంలో కొత్తగా నమోదు అయ్యే కేసులతో పాటు యాక్టివ్ కేసుల్లోనూ భారీ ఎత్తున తగ్గుదల కన్పిస్తోంది. కోవిడ్ బారిన పడిన వారు ఈ సారి అత్యంత వేగంగా కోలుకోవటం కూడా ఊరట కలిగించే పరిణామంగా చెప్పుకోవచ్చు. అయితే కొంత మందిలో మాత్రం కోవిడ్ తగ్గిన తర్వాత కూడా సమస్యలు వేధిస్తున్నాయి.
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 67,597 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసులు తొలిసారి పది లక్షల దిగువకు పడిపోయాయి. ఇది కూడా ఊరట కలిగించే పరిణామం. దేశంలో ఇప్పటివరకూ వ్యాక్సినేషన్ కార్యక్రమం 170 కోట్లకు చేరింది. ఒక్క సోమవారం నాడే కొత్తగా 55.7 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు. దేశ వ్యాప్తంగా కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతుండటంతో కీలక రాష్ట్రాలు అన్నీ ఆంక్షలను సడలిస్తున్నాయి.