దేశంలోని ఐటి కంపెనీలు 2022 సంవత్సరం నాటికి ఏకంగా 30 లక్షల ఉద్యోగాలకు కోత పెట్టనున్నాయా? . అంటే ఔననే చెబుతోంది బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక. వేగంగా విస్తరిస్తున్న ఆటోమేషనే ఇందుకు కారణం కానుందని పేర్కొంది. ఈ ఉద్యోగాల కోతల వల్ల ఐటి కంపెనీలకు ఏకంగా 7.3 లక్షల కోట్ల రూపాయల మేర ఆదా అవుతాయని అంచనా. ఇందులో సింహ భాగం వేతనాల రూపంలోనే. అభివద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థల్లో అత్యున్నత నైపుణ్యాలు కలిగిన వారు కూడా తగ్గుముఖం పడుతున్నారని ఈ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 16 మిలియన్ల మంది ఐటి ఉద్యోగులు ఉండగా..2022 నాటికి మూడు మిలియన్లను ఆయా సంస్థలు తగ్గించుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.
దేశంలో ఉన్న 16 మిలియన్ల ఐటి ఉద్యోగుల్లో 9 మిలియన్ల మంది తక్కువ నైపుణ్యం కలవారేనని..వీరంతా బీపీవో వంటి సంస్థల్లో పనిచేస్తున్నారని తెలిపారు. రోబోటెక్ ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్ పీఏ) అమలు ద్వారా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్ సీఎల్, టెక్ మహీంద్రా,కాగ్నిజెంట్ వంటి సంస్థలు 2022 నాటికి మూడు మిలియన్ల మేర సిబ్బందిని తగ్గించుకునే అవకాశం ఉందని తెలిపారు. అదే సమయంలో రోబోలు రోజులో 24 గంటలు పనిచేస్తాయని...మానవ వనరులతో పోలిస్తే వీటితో ఎక్కువ ఉత్పాదకత వస్తుందని ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది.