విదేశీ వ్యాక్సిన్లు రాబోతున్నాయి

Update: 2021-05-13 13:25 GMT

పీఎస్ యూలతోపాటు ప్రైవేట్ సంస్థలకు కోవాగ్జిన్ సాంకేతిక పరిజ్ణానం

రాష్ట్రాల గ్లోబల్ టెండర్లకు మార్గం సుగమం అయినట్లేనా?

భారత్ ప్రస్తుతం పెద్ద ఎత్తున వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటోంది. దేశ అవసరాలకు, అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ కు ఏ మాత్రం పొంతన లేదు. అయితే వైద్య రంగ నిపుణులు మాత్రం ఎంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తే అంత త్వరగా కోవిడ్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని..మూడవ దశ ముప్పును ఎదుర్కోవటానికి కూడా వ్యాక్సినేషన్, మాస్క్ లు ధరించటం, శానిటైజర్ వాడకం వంటి జాగ్రత్తలే కీలకం అని చెబుతున్నారు. ఈ తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో విదేశీ వ్యాక్సిన్లను కూడా అనుమతించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అనుమతులు కూడా ఒకట్రెండు రోజుల్లోనే జారీ చేయనున్నారు. అమెరికాకు చెందిన ఎఫ్ డిఏ, డబ్ల్యూహెచ్ వో ఆమోదించిన వ్యాక్సిన్లను బారత్ లో వాడకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. ప్రముఖ ఫార్మా సంస్థ అయిన ఫైజర్ తోపాటు మోడెర్నా లు తమ వ్యాక్సిన్లు తమ వ్యాక్సిన్ల సరఫరా కోసం భారత విదేశీ మంత్రిత్వ శాఖను సంప్రదించాయని నీతి అయోగ్ (వైద్యం) సభ్యుడు డాక్టర్ వి కె పాల్ వెల్లడించారు.

అదే సమయంలో జాన్సన్ అండ్ జాన్సన్ భారత్ లో వ్యాక్సన్ తయారీకి సిద్ధంగా తెలిపారు. దీంతో పాటు దేశంలో తయారు అవుతున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఇతర సంస్థల్లో తయారు చేసే అంశంపై కూడా ఆ కంపెనీతో చర్చ లు జరిగిపినట్లు వెల్లడించారు. అదే సమయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కూడా ఈ అంశంపై ట్వీట్ చేసింది. దేశంలో కోవాగ్జిన్ ఉత్పత్తిని పెంచటానికి వీలుగా పీఎస్ యూలతోపాటు ప్రైవేట్ సంస్థలకు సాంకేతిక పరిజ్ణానం బదిలీ చేసే అంశంపై భారత్ బయోటెక్ తో చర్చించినట్లు తెలిపింది. అదే సమయంలో ఇప్పటికే కేంద్రం ఆమోదం తెలిపిన రష్యా వ్యాక్సిన్ స్పుత్రిక్ వీ కూడా వచ్చే వారం నుంచి దేశంలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చేతికి లక్షన్నర వ్యాక్సిన్లు రాగా..మరికొన్ని త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రతిపక్షాలతోపాటు పలు రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్ల సరఫరాపై కేంద్రం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

అదే సమయంలో కేంద్ర వ్యాక్సినేషన్ విధానం కూడా విమర్శల పాలైంది. ఈ తరుణంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచటంతోపాటు పలు రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇదిలా ఉంటే పలు రాష్ట్రాలు వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు ప్రకటించాయి. ఈ తరుణంలో కేంద్రం విదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వటం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు రాష్ట్రాలకు పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అధిక రేట్ల ఉన్న వ్యాక్సిన్లను భరించటానికి ఎవరు ముందుకు వస్తారో..ఈ ధరలు ఎలా ఉండబోతున్నాయనే అంశం తేలాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే.

Tags:    

Similar News