కరోనా కొత్త కేసులు రోజుకో రికార్డు నమోదు చేస్తున్నాయి. లక్ష నుంచి రెండు లక్షల సంఖ్య చేరటానికి ఎంతో సమమం తీసుకోవటం లేదు. ఈ స్పీడ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. దేశంలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో నమోదు అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా కేసులు నమోదు అవుతున్నా ప్రస్తుతానికి పైన పేర్కొన్న రాష్ట్రాల అంత తీవ్రత లేదు. గడిచిన 24 గంటలలో 13.52 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా, 1,79,723 కొత్త కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటలలో మహమ్మారి బారిన పడి 146 మంది చనిపోయారు. ప్రస్తుతం 7,23,619 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటిచింది. పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి.
దేశంలో గత 24 గంటలలో 4,033 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో క్రియాశీల రేటు కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ రేటు 2.03 శాతంగా ఉంది. కొత్త వేరియంట్ కేసులతో కేంద్రం వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో కూడా వ్యాక్సినేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆదివారం నాటికి దేశంలో వ్యాక్సినేషన్ 151.94 కోట్ల డోసులకు చేరింది. ఆదివారం నాడు 29.60 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు.