భారత పౌరసత్వం వదులుకున్న 2.15 లక్షల మంది

Update: 2024-08-04 12:15 GMT

Full Viewగత కొన్ని సంవత్సరాలుగా ప్రతి ఏటా లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. ఇలా వదులుకుంటున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతోంది. 2023 లో ఏకంగా రెండు లక్షల పదిహేనువేల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. కేంద్రం ఈ విషయాన్ని అధికారికంగా రాజ్య సభలో వెల్లడించింది. ప్రతి ఏటా లక్షల సంఖ్యలో భారతీయులు తమ పౌరసత్వం వదులుకుంటున్న విషయంపై ఆప్ రాజ్య సభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆందోళన వ్యక్తం చేస్తూ దీని వెనక ఉన్న కారణాలపై కేంద్రం ఏమైనా అధ్యయనం చేసిందా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగానే గత ఏడాది అంటే 2023 లో 216219 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. అయితే 2022 తో పోలిస్తే ఈ సంఖ్యలో కొద్దిమేర తగ్గుదల నమోదు అయింది. 2022 లో ఏకంగా రెండు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై మంది పౌరసత్వాన్ని వదులుకున్నారు. 2021 లో ఈ సంఖ్య 1 . 63 లక్షలు, 2020 లో 85256 గా ఉంది. అయితే కేంద్రం మాత్రం లక్షల సంఖ్యలో భారతీయులు తమ పౌరసత్వం వదులుకోవడం వెనక వ్యక్తగత కారణాలు తప్ప మరేమి లేవు అని చెపుతోంది.

                                              వీళ్ళు అంతా భారతీయ పౌరసత్వాన్ని వదులుకుని తమకు నచ్చిన విదేశాలు వెళుతున్నారు. ప్రతి ఏటా ఇలా లక్షల సంఖ్యలో ఇలా భారత్ ను వీడిపోవటం వల్ల అటు ఆర్థికంగా..మరో వైపు మేధోపరంగా నష్టం ఉంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఇలా భారత్ వదిలి వెళుతున్న వాళ్లలో ఎక్కువ మంది మిలియనీర్లు ఉన్నారు. 2024 సంవత్సరంలోనే ఏకంగా 4300 మంది మిలియనీర్లు భారత్ ను వీడే అవకాశం ఉంది అని హెన్లీ వెల్త్ మైగ్రేషన్ నివేదిక అంచనా వేసింది. 2023 లో ఈ సంఖ్య 5100 ఉన్నట్లు తెలిపింది. భారత మిలియనీర్ల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఎంతో అనుకూలమైన గమ్యంగా ఉంది అని వెల్లడించారు. అక్కడ జీరో ఇన్ కం టాక్స్ పాలసీ తో పాటు గోల్డెన్ వీసా తో విలాసవంతమైన జీవితం, వ్యూహాత్మక ప్రాంతం కావటం వంటివి కీలకంగా మారాయి అని చెపుతున్నారు. యూఏఈ తో పాటు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టె వాళ్లకు పలు కీలక దేశాలు రకరకాల పేర్లతో పౌరసత్వం కలిపిస్తున్నాయి. 

Tags:    

Similar News