అంచనాలు అందుకోకపోతే మార్కెట్ పై ప్రభావం

Update: 2024-05-21 14:24 GMT

Full Viewబీజేపీ కి వచ్చే సీట్లకు...స్టాక్ మార్కెట్ కు జోరు కు లింక్ ఉందా?. అంటే అవుననే అంటున్నారు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ చెపుతున్నట్లు ఆ పార్టీ 370 దక్కించుకోకపోతే మాత్రం మార్కెట్ పై ఆ ప్రభావం పడుతుంది అని తెలిపారు. ఒక కంపెనీ ఫలితాలపై భారీ అంచనాలు ఉన్నప్పుడు..ఆ సంస్థ మంచి పని తీరు చూపించినా కూడా అంచనాలు అందుకోలేక పోతే ఆ ప్రభావం మార్కెట్ లో స్పష్టంగా కనిపిస్తుంది అని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. ఆయన జాతీయ ఛానల్ ఎన్డీటివీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ దగ్గర నుంచి బీజేపీ అగ్రనేతలు అందరూ తమ పార్టీ కి సొంతంగానే 370 సీట్లు వస్తాయని...కూటమి సభ్యులతో కలుపుకుంటే ఈ సంఖ్య 400 కి చేరుతుంది అని చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఏదో లెక్క తేడా కొడుతోంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయనే చర్చ కూడా మరో వైపు సాగుతోంది. అయితే ప్రశాంత్ కిషోర్ మాత్రం కేంద్రంలో మళ్ళీ ఖచ్చితంగా బీజేపీ సర్కారే వస్తుంది అని గట్టిగా చెపుతున్నారు.

                                      అయితే గత ఎన్నికల్లో వచ్చిన వాటి కంటే సీట్లు కాస్త అటు ఇటుగా ఉండవచ్చు కానీ...మోడీ హ్యాట్రిక్ ప్రధాని కావటం ఖాయం అన్న చందంగా ఆయన చెపుతూ వస్తున్నారు. మోడీ, అమిత్ షా లు జూన్ నాలుగు తర్వాత స్టాక్ మార్కెట్లు దూసుకువెళతాయి అని చెపుతుంటే...ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీ చెప్పిన నంబర్ కు చేరుకోకపోతే మాత్రం మార్కెట్ లు పతనం అవుతాయి అనే సంకేతాలు ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్ తర్వాత కానీ...ముందు కానీ మార్కెట్ లో భారీ కరెక్షన్ ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపు ఇండియా కూటమి నేతలు మాత్రం ఈ ఎన్నికల్లో బీజేపీ భారీగా మూల్యం చెల్లించుకోబోతుంది అని..ఇండియా కూటమే అధికారంలోకి వస్తుంది అని ప్రచారం చేస్తున్నారు. జూన్ ఒకటిన వచ్చే ఎగ్జిట్ పోల్స్, జూన్ నాలుగున వచ్చే అసలు ఫలితాల వరకు ఈ అంచనాలు సాగుతూనే ఉంటాయి.

Tags:    

Similar News