భారతీయ బిగ్ బుల్ రాకేష్ ఝున్ ఝున్ వాలా తాను కొత్తగా ప్రారంభించబోయే ఆకాశ ఎయిర్ లైన్స్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమర్శకులు తప్పని నిరూపిస్తా అని ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో తాను వైఫల్యాన్ని ఎదుర్కోవటానికి కూడా సిద్ధపడే ఇందుకు రెడీ అయ్యాయన్నారు. దేశవ్యాప్తంగా..ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఏవియేషన్ రంగం ఏమి అంత ఆశాజనకంగా లేదన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో బిగ్ బుల్ గా పేరున్న రాకేష్ ఝున్ ఝున్ వాలా ఎయిర్ లైన్స్ ప్రారంభించటంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అదే సమయంలో దీనిపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. విమర్శకుల వ్యాఖ్యలపై స్పందిస్తూ వారు తప్పని నిరూపిస్తానన్నారు. తాజాగా ఓ సీఐఐ నిర్వహించిన ఓ రియల్ ఎస్టేట్ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తానేమీ తన జీవితాన్ని ఇందులో పెట్టడం లేదని..తన భార్య నగలు అమ్మి ఈ వ్యాపారం ప్రారంభించటం లేదన్నారు. తాను వ్యక్తిగతంగా 275 కోట్ల రూపాయలు ఆకాశ ఎయిర్ లైన్స్ లో పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొన్నారు.
ఇందులో ఝున్ ఝున్ వాలాకు 40 శాతం వాటా ఉండనుంది. ముప్పయి సంవత్సరాల క్రితం తాను స్టాక్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్న సమయంలో కూడా తనను ఎవరూ నమ్మలేదని..కానీ వారు తప్పు అని నిరూపించానన్నారు. ఆకాశ ఎయిర్ లైన్స్ విషయంలోనూ ఇదే జరుగుతుందనే ధీమా వ్యక్తం చేశారు. ఎయిర్ లైన్ విషయంలోతన వ్యాపార ప్రణాళికలు తనకు ఉన్నాయని..యూరోపియన్ ఎయిర్ లైన్ రైనా ఎయిర్ ప్రారంభం నుంచి లాభాల్లోనే నడిచిందని..అక్కడే ఇతర ఎయిర్ లైన్స్ మూతపడ్డాయని తెలిపారు. అందులోనూ కరోనా కారణంగా విమానయాన రంగం తీవ్ర సమస్యల్లో ఉన్న తరుణంలో ఆయన రంగంలోకి ప్రవేశిస్తుండటం కూడా అత్యంత ఆసక్తికర పరిణామంగా మారింది. ఆకాశ ఎయిర్ లైన్స్ సేవలు ఈ ఏడాది జూన్ లో ప్రారంభం అయ్యే సూచనలు ఉన్నాయి. ఏప్రిల్ నాటికి కంపెనీ చేతికి తొలి విమానం అందుతుందని అంచనా. రియల్ ఎస్టేట్ రంగం బూమ్ వచ్చే సంవత్సరాల్లోనూ కొనసాగుతుందన్నారు. అదే సమయంలో రియల్ కంపెనీలు కొనుగోలుదారులకు ఏమి చేయగలమో అవి మాత్రమే చెప్పాలని సూచించారు.