పాక్ ప్రజలకు మోడీ పాలన కావాలంట!

Update: 2023-02-23 15:28 GMT

పాకిస్థాన్ ఇప్పుడు దివాళా తీసిన దేశం. మళ్ళీ ఎప్పటికి గాడిన పడుతుందో తెలియని పరిస్థితి. విదేశీ మారక నిల్వలు అడుగంటాయి...ప్రజలకు రెండు పూటలా తిండి దొరికే వాతావరణం లేదు. ధరలు అడ్డగోలుగా పెరగటంతో సామాన్య ప్రజలకు బతకటం కష్టంగా మారింది. దీంతో ప్రభుత్వం పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దేశాన్ని బాగుచేయాలంటే నరేంద్ర మోదీని తమకు ఇవ్వాలంటూ ఓ పాకిస్థానీ యువకుడు అల్లాకు ప్రార్ధన చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థానీ యూ ట్యూబర్ సనా అమ్జద్ ఈ వీడియో పోస్ట్ చేశారు. పాకిస్థాన్ నుంచి బతికుండగానే పారిపోండి, అవసరమైతే భారత్‌కైనా వెళ్లిపోండి అనే నినాదాలు పాకిస్థాన్ వీధుల్లో వినపడుతున్నాయని, దీనిపై స్పందన చెప్పాలని సనా అమ్జద్ ఓ యువకుడిని కోరారు. దీనికి అతడు సమాధానం ఇస్తూ తమకు నవాజ్ షరీఫ్ వద్దని, ఇమ్రాన్ ఖాన్, బెనజీర్, జనరల్ ముషారఫ్ వద్దని, కేవలం మోదీ కావాలన్నాడు. పాకిస్థాన్‌లో ప్రస్తుతం ధరలన్నీ ఆకాశాన్ని అంటాయని, సామాన్యులు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేకపోతున్నారని, మోదీ పాకిస్థాన్ ను  పాలిస్తే ధరలన్నీ అదుపులో ఉండేవని  అన్నాడు.

                           తాను పాకిస్థాన్‌లో పుట్టకపోయిఉంటే బాగుండేదని అతడు  వ్యాఖ్యానించటం విశేషం. దేశ విభజన జరిగి ఉండకపోయి ఉంటే తాము కూడా తక్కువ ధరకే కనీస అవసరాలు తీర్చుకోగలిగేవారమని, తమ చిన్నారులకు తక్కువ ధరకే ఆహారం అందించగలిగేవారమని అతడు వాపోయాడు.  టమాటోలు, చికెన్, పెట్రోల్ సహా అన్నింటినీ తక్కువ ధరకే తాము కూడా కొనుగోలు చేసేవారమని అభిప్రాయపడ్డాడు. ఇస్లామిక్ దేశమని ప్రకటించుకున్నా ఇస్లామ్‌ను అమలు చేయలేకపోయామని ఆ యువకుడు చెప్పాడు. మోదీ ఒక్కరే దేశాన్ని బాగుచేయగలరని, పాకిస్థాన్ ప్రజలకు మోదీ అంటే గౌరవముందని, అందరూ ఆయన్ను అనుసరిస్తున్నారని చెప్పాడు. దేశ విద్రోహ శక్తులను మోదీ గాడిలో పెట్టి ఉండేవాడని ఆ యువకుడు అభిప్రాయపడ్డాడు. మోదీ భారత్‌ను ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్ధిక శక్తిగా అవతరించేలా చేశారని పాక్ యువకుడు ప్రశంసలు కురిపించాడు. తాను మోదీ పాలనలో ఉండాలనుకుంటున్నట్లు చెప్పాడు. మోదీని తమకివ్వాలని తాను అల్లాను ప్రార్ధిస్తున్నానని చెప్పాడు. ఆర్థిక సంక్షోభం కారణంగా పెట్రోల్, డీజిల్ తో పాటు అన్నీ ధరలు అక్కడ పీక్ కు చేరాయి. కొద్ది రోజుల క్రితం శ్రీలంకలో ఉన్న వాతావరణమే ఇప్పుడు పాకిస్థాన్ లో కూడా ఉంది. 

Tags:    

Similar News