సీబీఐ కస్టడీలో ఉన్న వంద కిలోల బంగారం మాయం

Update: 2020-12-12 14:14 GMT

అది దేశంలోనే అత్యంత శక్తివంతమైన విచారణ సంస్థ. అలాంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కస్టడీలో ఉన్న 104 కిలోల బంగారం మాయం అయింది అంటే ఎవరైనా అవాక్కు అవ్వాల్సిందే. అందుకే సీబీఐ కూడా సిగ్గుపడింది. దీనిపై విచారణకు ఆదేశిస్తే తమ పరువుపోతుందని వాపోయింది. అయినా సరే మద్రాస్ హైకోర్టు మాత్రం అదేమి కుదరదు అంటూ ఈ ఘటనపై సీబీసీఐడి విచారణకు ఆదేశించింది. మరి ఈ విచారణలో కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. ఓ కంపెనీ సేఫ్ లో సీబీఐ లాక్, సీల్ తో దాచిన బంగారం మాయం అవటం అంటే మామూలు విషయం కాదు కదా మరి.

అయితే ఇది ఇంటి దొంగల పనా?. లేక అసలు దొంగలు ఎంట్రీ ఇచ్చారా?. అది జరిగే పనేనా?. వంటి అనుమానాలు ఎవరికైనా రావటం సహజం. ఇది తేలాలంటే కొంత సమయం పడుతుంది మరి. మాయం అయిన ఈ 104 కిలోల బంగారం విలువ 45 కోట్ల రూపాయలుగా ఉంటుందని అంచనా. 2012 నాటి కేసుకు సంబంధించిన 103 బంగారం అదృశ్యమైన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు సీబీసీఐడీని ఆదేశించింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తిచేసి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News