ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండనున్న వ్యాక్సిన్ల ధరలను కేంద్రం ప్రకటించింది. ఆయా కంపెనీల ప్రకటించిన ధరలతోపాటు జీఎస్టీ ఐదు శాతం, సర్వీస్ ఛార్జీలు కలుపుకుని ఏ వ్యాక్సిన్ ధర గరిష్టంగా ఎంతో వెల్లడించింది. కోవిషీల్డ్ ప్రైవేట్ ఆస్పత్రులకు డోసు ధరను 600 రూపాయలుగా నిర్ణయించింది. దీనిపై ఐదు శాతం జీఎస్టీ అంటే 30 రూపాయలు, సర్వీస్ ఛార్జి 150 రూపాయలు కలుపుకుంటే ఒక్కో డోస్ 780 రూపాయలుగా తేల్చారు. అదే కోవాగ్జిన్ అయితే డోసు ధరను 1200 రూపాయలుగా ప్రకటించింది. జీఎస్టీ 60 రూపాయలు, సర్వీస్ ఛార్జీ 150 కలిపితే 1410 రూపాయలు, స్పుత్నిక్ వి ధర 948 రూపాయలు, జీఎస్టీ 47 రూపాయలు, సర్వీసు ఛార్జి150 రూపాయలు కలిపితే 1145 రూపాయలు అవుతుందన్నారు.
ఈ మేరకు ఆయా ధరలను నోటిఫై చేస్తూ..రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధరల అమలును పరిశీలిస్తూ ఉండాలని కేంద్రం కోరింది. మారిన నూతన వ్యాక్సిన్ విధానం ప్రకారం ప్రైవేట్ ఆస్పత్రులకు 25 శాతం వ్యాక్సిన్లు దక్కనున్నాయి. మిగిలిన 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయనుంది.ఈ మేరకు ప్రధాని మోడీ సోమవారం నాడు కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. తాజాగా కేంద్రం వ్యాక్సిన్ల కొనుగోలుకు సంబంధించి భారీ ఆర్డర్లు ఇవ్వటంతోపాటు ఆడ్వాన్స్ చెల్లింపులు కూడా చేసింది.