ఆదిలోనే బోల్తా కొట్టిన గూగుల్ బార్డ్

Update: 2023-02-09 09:41 GMT

మైక్రోసాఫ్ట్ వర్సెస్ గూగుల్ పోరులో కొత్త మలుపు. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్ బోట్ ల పోటీ ఇప్పుడు వేడెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ పెద్ద ఎత్తున ఫండింగ్ చేసిన సంస్థ నుంచి చాట్ జీపీటి వచ్చి మార్కెట్లో దూసుకెళుతుండగా..ఉలిక్కిపడిన గూగుల్ కూడా వెంటనే తాము కూడా ఇదే తరహా చాట్ బోట్ బార్డ్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీనికోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇంత వరకు బాగానే ఉంది కానీ... ఈ తొందరలో విడుదల చేసిన ప్రమోషనల్ వీడియో లో బార్డ్ ఒక ప్రశ్నకు తప్పుడు సమాధానం ఇవ్వటం ఇప్పుడు కలకలం రేపుతోంది. బార్డ్ చేసిన ఒక ఒక తప్పుకు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఏకంగా వంద బిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో ఏకంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయింది.దీనికి కారణం బార్డ్ లో ఖచ్చితత్వం లేదనే వార్త బయటకు వచ్చాక ఆల్ఫాబెట్ షేర్లు బుధవారం నాడు ఏకంగా తొమ్మిది శాతం నష్టపోయాయి.

అదే సమయంలో మైక్రో సాఫ్ట్ షేర్లు మూడు శాతం పెరిగాయి. చాట్ జీపీటి ఇప్పటికి మార్కెట్లోకి వచ్చి అతి తక్కువ సమయంలో పది కోట్ల మంది సబ్ స్క్రైబర్లను సాధించి కొత్త రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో గూగుల్ బార్డ్ కు ఆదిలోనే హంసపాదు ఎదురుకావటం రాబోయే రోజుల్లో ఎంతో కొంత కంపెనీ పై ప్రభావం చూపించే అవకాశం ఉండనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే గూగుల్ తన వినియోగదారుల్లో ఎంత త్వరగా బార్డ్ పై నమ్మకం కల్పించి తాను అనుకున్నట్లు ముందుకు సాగగలదు అన్నది ఇప్పుడు కీలకం కానుంది. చాట్ జీ పీ టి కి పోటీ ఇవ్వాలనే తొందరలోనే ఈ పొరపాటు జరిగి ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ ఏఐ ఫైట్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో.

Tags:    

Similar News