గోవా బీచ్ లో ఇక ఐటి ఉద్యోగాలు చేసుకోవ‌చ్చు

Update: 2022-07-24 14:34 GMT

Full Viewగోవా. ఈ పేరు చెపితే యూత్ లో ఎక్క‌డ‌లేని జోష్ వ‌స్తుంది. అలాంటిది ఓ వైపు బీచ్ అందాలు చూస్తే అక్క‌డే ఐటి ఉద్యోగం చేసుకొనే అవ‌కాశం క‌ల్పిస్తే ఆ ఆనందాని కి ఇక అవ‌ధులు ఉండ‌వు. ఇప్పుడు గోవా స‌ర్కార్ అదే ప‌నిచేస్తోంది. ముఖ్యంగా ఐటి ఉద్యోగుల కోసం బీచ్ ల్లో కో వ‌ర్కింగ్ స్పేస్ (స‌హ ప‌ని ప్ర‌దేశాల‌ను) అందుబాటులోకి తేవాల‌ని నిర్ణ‌యించింది. క‌రోనా త‌ర్వాత మారిన ప‌రిస్థితుల్లో ఐటి కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు ర‌క‌ర‌కాల వెసులుబాట్లు కల్పిస్తున్నాయి. ఇలాంటి సౌక‌ర్యాన్ని ఉప‌యోగించుక‌నేందుకు గోవా ప‌ర్యాట‌క శాఖ‌, ఐటి శాఖ సంయుక్తంగా స‌న్నాహాలు చేస్తున్నాయి. తొలుత ఎంపిక చేసిన బీచ్ ల్లో స‌హ ఉద్యోగ స్పేస్ లు ఏర్పాటు చేసి త‌ర్వాత వీటిని మ‌రిన్ని ప్రాంతాల‌కు విస్త‌రింప‌చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ సౌక‌ర్యం వ‌ల్ల ఐటి ఉద్యోగులు ఎంచ‌క్కా గోవా బీచ్ ల అందాల‌ను ఆస్వాదిస్తూ త‌మ ఉద్యోగాలు చేసుకోవ‌చ్చు అన్న మాట‌.

ఇలా ఎన్ని రోజులు కావాలంటే అన్నిరోజుల గోవాలో ఉండొచ్చు. దీంతో ప్ర‌త్యేకంగా సెలవు పెట్టి గోవా వెళ్లాల్సిన అవ‌స‌రం అంటూ ఏమీ ఉండ‌దు. తొలి ద‌శ‌లో ఉత్త‌ర‌గోవాలోని మోర్ జిమ్, మిర్మార్ బీచ్ లను, దక్షిణ గోవాలోని బెనూలం బీచ్ ల‌ను ఈ కో స్పేస్ స్టేష‌న్ల ఏర్పాటుకు ఎంపిక చేశారు. ఇక్క‌డ ఉద్యోగులు బీచ్ అందాలు ఆస్వాదిస్తూ ప‌నిచేసుకోవ‌చ్చు. గోవాలో ఐటి ఏకో సిస్ట‌మ్ ఏర్పాటుకు కూడా ఇది ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని గోవా భావిస్తోంది. గోవాలో తెలంగాణ‌లో ఉన్న టి హ‌బ్ త‌రహాలో సౌక‌ర్యాలు ఏర్పాటు చేయాల‌ని యోచిస్తున్నారు. అంతే కాదు..గోవాలోని యువ‌త‌లో నైపుణ్యాలను మెరుగుప‌ర్చేందుకు తెలంగాణ‌కు చెందిన తెలంగాణ అకాడ‌మీ ఫ‌ర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)తో కూడా గోవా ఐటి శాఖ ఒప్పందం కుదుర్చుకునే దిశ‌గా స‌న్నాహాలు చేస్తోంది. అదే స‌మ‌యంలో ప‌ర్యాట‌క శాఖ కీల‌క గోవా బీచ్ ల్లో ముఖ్యంగా ఐటి ఉద్యోగుల‌కు అవ‌స‌రం అయ్యేలా ప్ల‌గ్ అండ్ ప్లే వంటి సౌక‌ర్యాల‌తో బీచ్ గుడిసెలను కూడా అందుబాటులోకి తేనున్నారు.

Tags:    

Similar News