రాజకీయ పార్టీలు అన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక అసలు ఫైటింగే మిగిలింది. అది కూడా డిసెంబర్ 1న పూర్తి కానుంది. ఈ రసవత్తర పోరులో విజేతలు ఎవరో డిసెంబర్ 4న వెల్లడి కానుంది. నగర ఓటర్లు అధికార టీఆర్ఎస్ వైపు నిలబడ్డారా? లేక ఊహించని రీతిలో పోటీ ఇచ్చినట్లు కన్పిస్తున్న బిజెపి ఊహించని ఫలితాలు రాబడుతుందా అన్నది వేచిచూడాల్సిందే. మిగిలిన ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, టీడీపీలు ఏ మేరకు సీట్లు దక్కించుకుంటాయి అన్న దానిపైనే వాటి భవిష్యత్ ఆధారపడి ఉండబోతుంది. ఎంఐఎం మాత్రం పాతబస్తీలో ఎప్పటిలాగానే తన పట్టు నిలుపుకునే అవకాశం ఉంది. టీఆర్ఎస్ తరపున ముఖ్యమంత్రి కెసీఆర్ ఒక్క బహిరంగ సభ ద్వారా ప్రచారం నిర్వహించగా, బిజెపి మాత్రం జాతీయ స్థాయి నేతలు అందరినీ రంగంలోకి దింపింది. భవిష్యత్ లో తెలంగాణాలో అధికారంలోకి రాబోతున్నామని సంకేతాలు ఇచ్చేందుకు వీలుగా జీహెచ్ఎంసీలో సత్తా చాటాలని బిజెపి ప్రయత్నాలు చేసింది. అందుకే అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం నిర్వహించింది.
ఇదిలా ఉంటే ఎన్నికలను సజావుగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది . డిసెంబర్ 1న అంటే మంగళవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 74,67,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 150 వార్డులనుంచి 1122మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ఎన్నికలు ముగిసేవరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారథి మీడియాతో మాట్లాడారు. ''ఇప్పటి వరకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. డిసెంబర్ 1న ఉదయం 5:30 గంటల వరకు ఎన్నికల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలి. ఉదయం 6 గంటలకు పోలింగ్ ఏజెంట్లు హాజరుకావాలి. ఉదయం 6 గంటల నుండి 6:15 గంటల మధ్య మాక్ పోలింగ్ జరుగుతుంది.
ఉదయం 6:55 గంటలకు బ్యాలెట్ బాక్స్‌లను సీల్ చేయడం జరుగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ పూర్తి అవుతుంది. కోవిడ్-19 పాజిటీవ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేని ఓటర్లకు ప్రత్యేక లైన్ ద్వారా ఓటువేసే అవకాశం ఉంటుంది. కోవిడ్ పాజిటివ్ ఓటర్లు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఓటు వేయవచ్చు. ఓటరు గుర్తింపు కార్డులేని ఓటర్లకు ఎంపిక చేసిన 21 ఇతర గుర్తింపు కార్డులు ఉన్నా ఓటింగ్ అవకాశం కల్పిస్తాం. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వృద్దులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశాం. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాం' అని తెలిపారు. ఓటు వేయటానికి వచ్చేవాళ్లు విధిగా మాస్క్ ధరించి రావాలన్నారు. జీహెచ్ఎంసీలో బయట వ్యక్తులు వెంటనే నగరం ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఎస్ఈసీ పార్ధసారధి ఆదేశించారు.