కరోనా సమయంలో ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (జీహెచ్ఐఏఎల్) కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. విమానాశ్రయంలో రద్దీ నియంత్రణకు కృత్రిమ మేధ ద్వారా అత్యాధునిక క్యూ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. వీడియో అనలిటిక్స్ ద్వారా దీన్ని అమలు చేయనున్నట్లు జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. సురక్షిత ప్రయాణం ద్వారా ప్రయాణికుల్లో విమానయానంపై విశ్వాసాన్ని నెలకొల్పేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది. విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాలలో ముఖ్యంగా ఎంట్రీ, చెకిన్, సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్ల వద్ద క్యూ నిర్వహణ, ప్రయాణీకుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడం, రద్దీని నివారించడం భద్రతకు కీలకంగా మారాయి. తాజాగా సెక్యూరిటీ కెమెరాలు, కృత్రిమ మేధ వీడియో అనలిటిక్స్ కలిపిన క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్‌ను అమలులోకి తెచ్చింది. ఇది విమానాశ్రయంలోని వివిధ ప్రదేశాలలో ప్రయాణీకులు వేచి ఉండే సమయాన్ని తగ్గించి, రద్దీని తగ్గించి తద్వారా ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. దీనిని జీహెచ్ ఐఏఎల్ లో ఈ టెక్నాలజీలో భాగస్వామి అయిన ఆల్‌గోవిజన్ టెక్నాలజీస్‌తో కలిసి అమలు చేస్తోంది. కెమెరా ఆధారిత వీడియో అనలిటిక్స్‌ను ఉపయోగించే ఈ స్మార్ట్ క్యూ మేనేజ్‌మెంట్ సొల్యూషన్ ప్రయాణికులు వేచి ఉండే సమయాన్ని పర్యవేక్షిస్తూ రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని వల్ల విమానాశ్రయంలో ప్రయాణీకులు ఎంత సేపు నిరీక్షించాలి, వారి సర్వీస్ టైమ్ ఎంత పడుతుంది వంటి వివిధ కీలక అంశాలు ప్రయాణికులకు ముందుగానే తెలుస్తాయి.
తద్వారా వారు రద్దీగా లేని మార్గాలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ అధునాతన వీడియో అనలిటిక్స్ - వివిధ కెమెరాల నుండి అందే వీడియోలను విశ్లేషించి, ప్రయాణీకుల సంఖ్యను ఖచ్చితంగా అంచనా వేయడానికి డీప్ లెర్నింగ్ బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడళ్లను ఉపయోగిస్తుంది. దీని ద్వారా క్యూ మేనేజ్‌మెంట్‌తో పాటు, కెమెరా ట్యాంపరింగ్, పార్కింగ్ ఉల్లంఘన, తప్పుడు మార్గంలో వచ్చే వాటిని గుర్తించడం లాంటి వాటిని కూడా పసికట్టవచ్చు. నూతన సౌకర్యంపై జీహెచ్ ఐ ఏఎల్ సీఈవో ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ "ప్రస్తుత కోవిడ్ సమయంలో ప్రయాణీకుల భద్రత ముఖ్యం. ప్రయాణీకులు సురక్షితంగా ఉండడం కోసం జీహెచ్ ఐ ఏఎల్ అనేక భద్రతా చర్యలను తీసుకుంటోంది. ఈ స్మార్ట్ క్యూ మేనేజ్‌మెంట్ టెక్నాలజీ వల్ల ప్రయాణికుల భద్రత మరింత పెరుగుతుంది. ఎలాంటి ఆటంకాలూ లేని ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. వినూత్న సాంకేతిక పరిష్కారాలను అమలు చేయడంలో జీహెచ్ ఐ ఏఎల్ ఎల్లప్పుడూ ముందుంటుంది. విమాన ప్రయాణంపై విశ్వాసాన్ని పెంచే ఈ ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయడంలో ఆల్‌గోవిజన్‌తో భాగస్వామ్యం కావడం మాకు సంతోషంగా ఉంది." అన్నారు.