దేశీయ విమానయానం ఇప్పుడిప్పుడే గాడినపడుతోంది. జీఎంఆర్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఈ పరిస్థితి స్పష్టంగా కన్పిస్తోంది. జూన్ తో పోలిస్తే జులై నెలలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వ్యాపార అవసరాలతోపాటు స్నేహితులతో కలసి లీజర్ ట్రిప్పులు..పర్యాటక ప్రాంతాల సందర్శన కూడా పెరిగింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జూలైలో విమానాల రాకపోకల్లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. జూన్ 1న కేవలం 100కి విమానాల రాకపోకలు జరగ్గా, జూలై 25 నాటికి అవి 288కి చేరుకున్నాయి. జూన్ 1న దాదాపు 10 వేల మంది ప్రయాణీకుల ఉంటే, ఈ ప్రయాణీకుల సంఖ్య దాదాపు మూడుసార్లు పెరిగి జూలై 18న ఒకే రోజు ప్రయాణించిన వారి సంఖ్య 29 వేలు దాటింది. విమానాశ్రయం నుంచి వచ్చిపోయే రోజువారీ ప్రయాణీకుల సంఖ్య రెండు నెలల్లో మూడింతలైంది. జులై నెలలో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 6.8 లక్షల మంది దేశీయ ప్రయాణికులు, 50,000 మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు జరిగాయి.
ఇటీవల హైదరాబాద్ నుంచి ఒక కొత్త గమ్యస్థానం శ్రీనగర్ కొత్తగా చేరింది. ఇండిగో హైదరాబాద్ నుండి శ్రీనగర్‌కు వారానికి నాలుగు రోజులు -సోమవారం, బుధవారం, శుక్రవారం మరియు ఆదివారం నేరుగా విమాన సర్వీసులను నడుపుతోంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచి మరో నాలుగు కొత్త రూట్లు కూడా ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో ఆగస్టు 22 నుండి హైదరాబాద్ నుండి మాలెకు విమాన సర్వీసులు పున:ప్రారంభం అయ్యాయని జీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. గోవా, జైపూర్, కొచ్చిలాంటి లీజర్ డెస్టినేషన్స్ కు హైదరాబాద్ నుండి వెళ్లే ప్రయాణీకుల సంఖ్యలో భారీ వృద్ధి నమోదైంది. విశ్రాంతి/వెకేషన్ ట్రావెల్‌తో పాటు, ఎస్ఎంఈ బిజినెస్ ట్రావెల్ మరియు విజిటింగ్ ఫ్రెండ్స్ & రిలేటివ్స్ ప్రయాణీకుల సంఖ్య పెరగడానికి ఎక్కువగా దోహదపడ్డాయన్నారు.