స్టాక్ మార్కెట్లు సానుకూల సంకేతాలు పంపాయి. కొత్త సంవత్సరంలో తొలి సెషన్ ట్రేడింగ్ జరిగిన సోమవారం నాడు సూచీలు దుమ్మురేపాయి. దీంతో ఇన్వెస్టర్లకు ఓ భరోసా పంపినట్లు అయిందని భావిస్తున్నారు. గత కొంత కాలంగా ఊగిసలాడుతున్న మార్కెట్లు తొలి రోజు శుభారంభం చేయటం అందరిలో ఉత్సాహన్ని నింపిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సోమవారం నాడు ప్రారంభం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల బాటలోనే సాగాయి. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 929 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ 59,183.22పాయింట్ల వద్ద ముగిసింది.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, మెటల్, ఐటీ, ఆటో రంగాల అండతో సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. గత ఏడాది చివరలో అమ్మకాలకు దిగిన విదేశీ మదుపర్లు తిరిగి కొత్తగా భారత్‌కు వస్తారనే అంచనాలూ మార్కెట్ కు కలిసొచ్చాయి. ఇటీవల వరకూ ఒమిక్రాన్ భయాలు మార్కెట్ ను వెంటాడినా ఈ వైరస్ తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చనే అంచనాలు సెంటిమెంట్ ను మెరుగుపర్చింది. బీఎస్ఈతోపాటు నిఫ్టీ కూడా లాభాల బాటలోనే సాగింది.