కరోనా రెండవ దశ ఉపద్రవం నుంచి భారత్ క్రమక్రమంగా కోలుకుంటోంది. గత కొన్ని రోజులుగా ఇవే సంకేతాలు అందుతున్నాయి. తొలిసారి దేశంలో కరోనా కేసుల సంఖ్య రెండు లక్షల దిగువకు చేరింది. ఇది పెద్ద ఊరట నిచ్చే అంశంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ 15 నాటికి దేశంలో కరోనా రెండవ దశ చాలా వరకూ తగ్గుముఖం పడుతుందనే అంచనాలు ఉన్నాయి. దేశంలోని కీలక రాష్ట్రాలు అన్నీ లాక్ డౌన్లు అమలు చేయటం కూడా చాలా వరకూ కలిసొచ్చిందనే చెప్పాలి. కొత్త కేసులతోపాటు దేశంలో యాక్టివ్ కేసులు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,96,427 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,511 మంది మృతి. మరణాలు కూడా అంతకు ముందు రోజుతో పోలిస్తే తగ్గుముఖం పట్టడం ఊరట కల్చించే పరిణామంగానే ఉంది.
నిన్న ఒక్కరోజే 3,26,850 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 2,69,48,874 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 25,86,782 మందికి చికిత్స. కొనసాగుతోంది. కరోనా నుండి ఇప్పటి వరకు కోలుకున్న బాధితులు 2,40,54,861 మందిగా ఉన్నారు. దేశంలో కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,07,231 కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 19,85,38,999 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు తెలిపారు.