అమెరికా ఫెడ్ ఎఫెక్ట్ తో గురువారం నాడు భారతీయ స్టాక్ మార్కెట్లలో జోష్ నెలకొంది. ఫెడ్ రిజర్వు 50 బేసిస్ పాయింట్స్ మేర వడ్డీ రేట్లను తగ్గించటం ఈ జోష్ కు కారణం అయింది. నాలుగు సంవత్సరాల తర్వాత ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించటం ఇదే మొదటిసారి. ఇప్పుడు 50 బేసిస్ పాయింట్స్ తగ్గించటంతో పాటు రాబోయే రోజులు కూడా వడ్డీ రేట్ల కోతకు సంకేతం ఇవ్వటం అమెరికా తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించింది. భారతీయ మార్కెట్ లు కూడా ఫెడ్ నిర్ణయంతో కొత్త గరిష్టాలకు చేరాయి. బిఎస్ఈ సెన్సెక్స్ తో పాటు ఎన్ఎస్ఈ నిఫ్టీలు కూడా కొత్త రికార్డు లు నమోదు చేశాయి.
అయితే మార్కెట్ లో ఇప్పుడు పలు కీలక షేర్ల వాల్యూయేషన్స్ గరిష్ట స్థాయికి చేరినందున..ఈ ట్రెండ్ నిలబడుతుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే అని నిపుణులు చెపుతున్నారు. గురువారం నాడు ఎన్ టిపీసి షేర్లలో భారీ ర్యాలీ సాగింది. స్ట్రాంగ్ గా ఓపెన్ అయిన ఈ షేర్లు ఉదయం పది గంటల లోపే 430 రూపాయల జీవిత కాల గరిష్ఠానికి చేరింది. ఫెడ్ నిర్ణయంతో కొన్ని ఐటి షేర్లు కూడా లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ లో ఎక్కువ వెయిటేజీ ఉన్న రిలయన్స్ షేర్లు కూడా పదహారు రూపాయల లాభంతో 2942 రూపాయల వద్ద కొనసాగుతోంది.