విమానాలు గాల్లో ఉన్నప్పుడే ఫైట్ లు..డోర్లు తెరిచే ప్రయత్నాలు వంటి ఘటనలు చాలానే జరుగుతున్నాయి. కానీ ఈ సంఘటన మాత్రం ఎవరూ ఊహించనిది. అది న్యూ యార్క్ నుంచి న్యూ ఢిల్లీ కి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం. సహజంగా బిజినెస్ క్లాస్ లో టికెట్ అంటే సంపన్నులు మాత్రమే భరించగలరు. రెగ్యులర్ టికెట్ కంటే చాలా ఖరీదు ఉంటుంది. మరి ఇంత ఖరీదు పెట్టి బిజినెస్ క్లాస్ టికెట్ కొన్న వ్యక్తి ఒకరు ఎవరూ చేయని పని చేశాడు. గత ఏడాది నవంబర్ లో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే మద్యం మత్తులో ఒక ప్రయాణికుడు ఏకంగా ఒక మహిళపై మూత్రం పోశాడు. ఈ పరిణామంతో ఆ మహిళా షాక్ కు గురైంది. రాత్రి భోజనం తర్వాత లైట్ లు ఆర్పివేసిన సమయంలో ఈ ఘటన జరిగింది.
ఆ వ్యక్తి చేసిన పనితో ఆ మహిళ దుస్తులతో పాటు సీట్ కూడా తడిచిపోయింది. అయినా సరే విమాన సిబ్బంది ఖాళీగా ఉన్న బిజినెస్ క్లాస్ లోని ఇతర సీట్ కేటాయించకుండా ఆమె కూర్చున్న సీట్ పైనే కవర్ లు వేశారు..ఆమె నిరసన తెలపటం తో సిబ్బంది సీట్ ఇచ్చారు. ఇంత జరిగినా కూడా విమానంలో దారుణంగా వ్యవహరించిన వ్యక్తి ఢిల్లీ విమానాశ్రయం నుంచి హాయిగా బయటకు వెళ్లి పోయాడు. సిబ్బంది తీరును తప్పు పడుతూ బాధిత మహిళ ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కు లేఖ రాశారు. అయితే చాలా ఆలస్యంగా ఎయిర్ లైన్ సదరు ప్రయాణికుడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అతడిని నో ఫ్లై లిస్ట్ లో చేర్చాలని డీజీసిఏ ను కోరింది. డీజీసిఏ కమిటీ కూడా దీనిపై విచారణ చేస్తోంది.