కేంద్రం తీరుపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఫైర్
కేంద్రం తీరుపై తమిళనాడు సీఎం, డీఎంకె అధినేత ఎం కె స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సారధ్యంలోని అధికార భాషా పార్లమెంటరీ కమిటీ ఐఐటీ, ఐఐఎంలతోపాటు అన్ని కేంద్రీయ విద్యా సంస్థల్లో హిందీలోనే బోధన చేయాలని సిఫారసు చేయటంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యా సంస్థల్లోనూ హిందీలోనే బోధన సాగాలన్నారు. ఇలాంటి చర్యల ద్వారా మరోసారి మాతృభాషా సెంటిమెంట్ అనే మంటను రెచ్చగొట్టొద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. పార్లమెంటరీ కమిటీ తన సిఫారసులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసిందని..ఇది భారత దేశ ఆత్మపై దాడివంటిదే అని ఆరోపించారు. ఈ కమిటీ సిఫారసులపై స్టాలిన్ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో స్పందిస్తూ కేంద్ర తీరును తప్పుపట్టారు. భారత్ అంటేనే భిన్నత్వంలో ఏకత్వం అని..అందరిపై హిందీ రుద్దాలని చూడటం ఏ మాత్రం తగదన్నారు. హిందీ మాట్లాడేవారే ప్రధమ శ్రేణి పౌరులు..ఇతర భాషలు మాట్లాడే ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడొద్దని హెచ్చరించారు. అసలు ఇప్పుడు దేశంలోని ప్రజలందరిపై హిందీని బలవంతంగా రుద్దాల్సిన అవసరం ఏమోచ్చిందని స్టాలిన్ ప్రశ్నించారు. ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.
తప్పనిసరి హిందీ అని రుద్దాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒకే దేశం..ఒకే భాష పేరుతో ప్రజలపై హిందీ రుద్దాలని చూస్తుందని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న 22 అధికార భాషలకు తోడు కొత్త వాటిని చేర్చాలనే డిమాండ్లు ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన పోటీ పరీక్షల్లో ఇంగ్లీష్ ను తొలగించాలని సిఫారసు చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కేంద్ర ప్రతిపాదనను స్టాలిన్ తీవ్రంగా తప్పుపట్టారు. భారత్ మాతాకి జై అన్నది ఓ రాజకీయ పార్టీ నినాదంగా ఉందని..ఇది హిందీకి తల్లిపాలు తాగించి..ఇతర భాషలకు విషం పెడతారా అని స్టాలిన్ ప్రశ్నించారు. సెప్టెంబర్ 16న హిందీ దివస్ లో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిషా హిందీ అధికార భాష అని ప్రకటించారని..ఇప్పుడు ఆయన నాయకత్వంలోని పార్లమెంటరీ కమిటీ విద్యా సంస్థల్లో హిందీని తప్పనిసరి చేయాలని చూస్తోందని విమర్శించారు. మాతృ భాషను ప్రేమించే వారు ఎవరూ కేంద్ర నిర్ణయాలను సమర్ధించరన్నారు. తమిళంతో ఇతర భాషలను కూడా సమానంగా గౌరవించాల్సిందేనన్నారు.