జీఎంఆర్ నిర్వహణలో ఉన్న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ తీరుపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కరోనా సమయంలో ధరఖాస్తుల భర్తీకి కనీసం చిన్న టేబుల్స్ కూడా వేయలేరా? అని ఆయన ప్రశ్నించారు. తెల్లవారు జామున ఒంటిగంటకు లుఫ్తాన్సా విమానంలో వచ్చిన ప్రయాణికులకు ఆర్ టీపీసీఆర్ టెస్ట్ లకు సంబంధించి వివరాలు అందించేందుకు ఫారాలు ఇచ్చారని..కానీ వాటిని నింపేందుకు అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. దీంతో ప్రయాణికులు గోడలకు ఆనించి..లేదా కింద కూర్చుని ఫారాలు నింపాల్సి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ఆయన వరస ట్వీట్లు చేశారు.
ఇదిలా ఉంటే ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చే ద్వారం వద్ద ఎన్నో వీధి కుక్కలు ఉన్నాయి. ఇలాంటివి చూస్తే విదేశీయులకు మన దేశంపై ఎలాంటి భావన కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. దయచేసి వీటిపై దృష్టి సారించండి 'అని రాజమౌళి ట్వీట్ చేశారు. కోవిడ్ సమయంతో పాటు మామూలు సమయాల్లో కూడా ప్రయాణికుల విషయంలో తాము ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని జీఎంఆర్ విమానాశ్రయం చెబుతూ ఉంటుంది. అంతే కాదు..ఢిల్లీ విమానాశ్రయానికి పలు అవార్డులు కూడా వచ్చాయి. మరి రాజమౌళి విమర్శలపై జీఎంఆర్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.