ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు విమానంలో రావాలంటే పట్టే సమయం రెండు గంటల పదిహేను నిముషాలు.. ఢిల్లీ నుంచి ముంబై పోవాలన్నా కూడా ఇంచు మించు ఇదే సమయం పడుతుంది. కానీ ఇలా విమాన ప్రయాణం చేయటానికి మాత్రం విమానాశ్రయానికి మూడున్నర గంటల ముందు రావాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3 లో ఇప్పుడు నిత్యం ప్రయాణికులు కుప్పలు తెప్పలుగా ఉంటున్నారు. రైల్వే స్టేషన్లు..బస్సు స్టాండ్ల కంటే ఎక్కువ జనాలు విమానాశ్రయంలో కనిపిస్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి.
దీనికి సంబదించిన ఫోటోలు కూడా గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా దీనిపై స్పందించి గేట్లు పెంచి వేగంగా ప్యాసెంజర్స్ ను క్లియర్ చేసే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో ఇండిగో ఎయిర్ లైన్స్ తన ప్రయాణికులకు మూడున్నర గంటల ముందు రావాలని కోరింది. అప్పుడు ప్రయాణం సాఫీగా సాగే అవకాశం ఉందని తెలిపింది. మాములుగా ఈ టైం అంతర్జాతీయ ప్రయాణికులకు వర్తిసుంది. కానీ పెరిగిన రద్దీ కారణంగా దేశీయ ప్రయాణికులను కూడా ఇంత ముందు రమ్మనటంపై విమర్శలు వస్తున్నాయి.