ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలతో విమానాశ్రయంలోని కొన్ని ప్రాంతాల్లోకి భారీ వరద నీరు వచ్చింది. ముఖ్యంగా టెర్మినల్ 3 ప్రాంతంలో వర్షపునీరు భారీగా చేరింది. దీంతో పలు విమాన సర్వీసులకు కూడా అంతరాయం కలుగుతోంది. ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇండిగోతోపాటు విస్తారా ఎయిర్ లైన్స్ తమ తమ ప్రయాణికులకు ముందస్తు సూచనలు చేస్తున్నాయి. అంతేకాకుండా నగరం అంతా భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ అయినందున విమానాశ్రయానికి చేరుకునే సమయాన్ని కూడా చూసుకోవాలని కోరాయి.
భారీ వర్షాల వల్ల విమానాశ్రయంలోని ముందు భాగం కొంత సమయం పాటు నీట మునిగిందని..తమ సిబ్బంది ఈ నీటిని తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారని ఢిల్లీ విమానాశ్రయం కూడా ట్విట్టర్ లో వెల్లడించింది. గత 46 సంవత్సరాల్లో ఎన్నడూలేని రీతిలో ఢిల్లీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దీంతో సాధారణ జనజీవనంతోపాటు విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. విమానాల రాకపోకల్లో విపరీతమైన జాప్యం జరుగుతోంది.