ఇది ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం. కోవిడ్ హాట్ స్పాట్ అంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త,ఆర్ పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా ఈ ఫోటోను ట్వీట్ చేశారు. ఆదివారం నాటి పరిస్థితి అంటూ ఆయన ఈ ఫోటోను షేర్ చేశారు. దీంతోపాటు ఈ విమానాశ్రయానికి చెందిన రద్దీ ఫోటోలు పలు వైరల్ గా మారాయి. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా విమానాశ్రయాల్లో నూతన నిబందనలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికులు..అది కూడా రిస్క్ దేశాలుగా గుర్తించిన ప్రాంతాల నుంచి వచ్చే వారు విధిగా విమానాశ్రయంలోనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఈ టెస్ట్ ను తప్పనిసరి చేశారు. దీంతో చాలా మంది గుంపులు గుంపులుగా వేచిచూడాల్సి వస్తోంది. తాజాగా ఢిల్లీలో ఒక ఒమిక్రాన్ వేరియంట్ కేసు వెలుగుచూసిన విషయం తెలిసిందే.
ఈ అంశంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. విమానాశ్రయ అధికారులు, పౌరవిమానయాన శాఖ ఈ పరిస్థితిని మరింత తెలివిగా హ్యాండిల్ చేసి ఉండాల్సింది అంటూ పేర్కొన్నారు. ఎక్కువ మంది ప్రయాణికులు ఉన్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని..నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్న వారు దీనిపై ఫోకస్ పెట్టాలన్నారు. అయితే ఢిల్లీ విమానాశ్రయంలో రద్దీ ఎక్కువగా ఉన్న కోవిడ్ నిబంధనలు సరిగానే పాటిస్తున్నట్లు కొంత మంది ప్రయాణికులు మీడియాకు వివరించారు. అదే సమయంలో కోవిడ్ టెస్ట్ లు చేసే కేంద్రాలను పెంచటంతోపాటు ముందుగానే టెస్ట్ ల కోసం బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు.