ఓ వైపు మూడవ దశ కరోనా హెచ్చరికలు. మరో వైపు దేశమంతటా అన్ లాక్ ప్రక్రియ. కొన్ని రాష్ట్రాలు అయితే ఏకంగా అప్పుడే స్కూళ్ళు పెట్టేందుకు కూడా రెడీ అవుతున్నాయి. అందులో తెలంగాణ కూడా ఉంది. అయితే ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా పిల్లలకు సంబంధించిన కరోనా వ్యాక్సిన్ పై కీలక విషయాలు వెల్లడించారు.. దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ డెవలప్ చేస్తున్న పిల్లల వ్యాక్సిన్ రెండు, మూడు దశల ప్రయోగాల ఫలితాలు సెప్టెంబర్ నాటికి వస్తాయన్నారు. అదే నెలలో అనుమతి కూడా వచ్చేఅవకాశం ఉందని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను రెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్ల లకు ఇవ్వొచ్చు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో పిల్లల వ్యాక్సిన్ కు సంబంధించి ప్రయోగాలు సాగుతున్నాయి. అదే సమయంలో అమెరికాకు చెందిన ఫైజర్, బయోఎన్ టెక్ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందన్నారు.
అప్పుడు పిల్లలకు ఏది కావాలనుకుంటే అది ఇవ్వొచ్చని వెల్లడించారు. ఇండియా టుడే తో మాట్లాడుతూ గులేరియా ఈ విషయాలు తెలిపారు. ఎయిమ్స్ ఆస్పత్రిలో కూడా పిల్లలపై ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. మే12న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) భారత్ బయోటెక్ కు పిల్లల వ్యాక్సిన్ కు సంబంధించి రెండు, మూడు దశల ట్రయల్స్ కు అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. పాఠశాలల ప్రారంభంపై కూడా గులేరియా స్పందించారు. విద్యా సంస్థలు సూపర్ స్ప్రెడర్స్ గా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సంపూర్ణ అవగాహనతో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఓపెన్ ఎయిర్ స్కూల్ విధానం బెటర్ అని సూచించారు.