చైనాలో పుచ్చ‌కాయ‌లు..అల్లానికి ఇళ్లు అమ్ముతున్నారు

Update: 2022-07-05 09:45 GMT

చైనా రియల్‌ ఎస్టేట్ మార్కెట్ మ‌రింత తీవ్ర సంక్షోభంలో ప‌డిపోయింది. ఇళ్ళ కొనుగోలుకు డౌన్ పేమెంట్ కింద రియ‌ల్ ఎస్టేట్ సంస్థ‌లు పుచ్చ‌కాయ‌లు..అల్లం. గోధుమ‌లు వంటి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను కూడా తీసుకుంటున్నాయి. ఇది చూస్తే చైనా రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ ప‌రిస్థితి ఎలా ఉందో ఊహించుకోవ‌టం పెద్ద క‌ష్టం కాబోదు. అదే స‌మ‌యంలో కోవిడ్ కార‌ణంగా విధించిన ఆంక్షల‌తో ఈ ఏడాది జ‌న‌వ‌రి-జూన్ కాలంలో ఇళ్ల అమ్మ‌కాల మార్కెట్ దాదాపు 25 శాతం మేర ప‌త‌నం అయింద‌ని మార్కెట్ ప‌రిశీల‌కులు తెలిపారు. చైనాలో భారీ ఉద్యోగాలను అందించే రియల్ ఎస్టేట్ కుప్పకూలి పోవటం ఆందోళనకు కార‌ణం అవుతోంది. దీంతో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు బిల్డర్లు కొత్త ఆఫర్లను ఆందిస్తున్నారు. ఒకవైపు కొనుగోలుదారులేక, మరోవైపు ఇప్పటికే గృహాలను కొనుగోలుచేసిన వారు డబ్బులు చెల్లించక పోవడంతో ప్రాపర్టీ డెవలపర్లను కష్టాల్లోకి నెట్టేసింది. చైనా హౌసింగ్ మార్కెట్ మందగమనానికి తోడు ప్రాజెక్ట్‌లను ప్రారంభించే ముందు బిల్డర్లు డిపాజిట్లు తీసుకోవడంపై ప్రభుత్వ నిషేధం విధించింది. తూర్పు నగరమైన నాన్‌ జింగ్‌లోని ఒక డెవలపర్ స్థానిక రైతుల నుండి డౌన్‌పేమెంట్‌గా 100,000 యువాన్ల వరకు విలువైన ట్రక్కుల పుచ్చకాయలను స్వీకరిస్తున్నారు. 100,000 యువాన్ల విలువను 5000 కిలోల పుచ్చకాయలుగా లెక్కిస్తున్నారు. మరో చిన్న పట్టణమైన వుక్సీలో, మరొక డెవలపర్ పీచెస్ పళ్లను తీసుకుంటున్నట్లు వార్త‌లు వ‌చ్చాయి. సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని ప్రధాన వెల్లుల్లి ఉత్పత్తి ప్రాంతమైన క్వి కౌంటీలోని గృహ కొనుగోలుదారులు తమ డౌన్‌ పేమెంట్‌లో కొంత భాగాన్ని మార్కెట్ ధర కంటే మూడు రెట్లు ఎక్కువ ధరకు తమ ఉత్పత్తులను మార్పిడి చేసుకుంటున్నారు.

కొత్త వెల్లుల్లి సీజన్ సందర్భంగా, క్వి కౌంటీలోని వెల్లుల్లి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని హోమ్‌బిల్డర్ సెంట్రల్ చైనా మేనేజ్‌మెంట్ మే చివరిలో సోషల్ మీడియాలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారంతో అమ్మకాలు పెరిగాయ‌ని స‌మాచారం. రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని ఆదుకునేందుకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా గృహ రుణాలపై కనీస వడ్డీ రేటును కూడా తగ్గించింది. 4.6 శాతం నుంచి 4.4 శాతం వరకు కోత పెట్టింది. ప్రస్తుతం చైనా గృహ రుణాల విలువ 10 ట్రిలియన్లకు డాలర్లకు చేరింది. చైనా ప్ర‌గ‌తిలో రియ‌ల్ ఎస్టేట్ రంగానిది అత్యంత కీలక పాత్ర అని చెప్పుకోవాల్సిందే. జిన్ పింగ్ ప్రెసిడెంట్ అయిన త‌ర్వాత ఈ రంగం గ‌తంలో ఎన్న‌డూలేని రీతిలో కొత్త శిఖ‌రాల‌కు చేరింది. అయితే ఇప్పుడు చైనాలో ప‌లు కీల‌క సంస్థ‌లు రుణ చెల్లింపులో డిఫాల్ట్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌ముఖ అంత‌ర్జాతీయ ఆర్ధిక సేవ‌ల సంస్థ గోల్డ్ మ‌న్ శాక్స్ అంచ‌నా వేస్తోంది. ప్ర‌స్తుత రియ‌ల్ ఎస్టేట్ ప‌తనానికి స్పెక్యు లేష‌న్ కూడా ఓ కార‌ణం అని భావిస్తున్నారు.

Tags:    

Similar News