మహారాష్ట్ర విషయానికి వస్తే అక్కడ ఉన్న 48 లోక్ సభ సీట్లలో గత ఎన్నికల్లో ఎన్డీయే 41 సీట్లను దక్కించుకుంది. బీజేపీ సొంతంగా 25 సీట్లలో పోటీ చేసి 23 సీట్లు గెలుచుకుంది. అయితే ఇక్కడ బీజేపీ ఈ సారి పది సీట్ల వరకు కోల్పోయే అవకాశం ఉంది అని చాట్ జీపీటి అంచనా వేసింది. దేశ రాజధాని ఢిల్లీ విషయంలో కూడా ఆసక్తికర అంశాలను వెల్లడించింది. గత ఎన్నికల్లో బీజేపీ అక్కడ ఉన్న ఏడు సీట్లు కూడా గెలుచుకుంది. అయితే ఈ సారి మాత్రం బీజేపీ ఇక్కడ ఐదు సీట్లు కోల్పోయే అవకాశం ఉంది అని అంచనా వేసింది. ఈ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ లు పొత్తు పెట్టుకుని ఇక్కడ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కూడా ఈ ఎన్నికల్లో బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్న తరుణంలో చాట్ జీపీటి ఏకంగా ఐదు సీట్లు తగ్గే అవకాశం ఉంది అని చెప్పటం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే బీహార్ లో కూడా బీజేపీ నష్టపోవటం పక్కా అని చెపుతోంది.
మరో కీలక విషయం ఏమిటి అంటే 2019 ఎన్నికలతో పోలిస్తే బీజేపీ కి ఈ సారి సీట్లు తగ్గే అవకాశం ఉన్నా కూడా మరో సారి కేంద్రంలో మోడీ సర్కారు వచ్చే అవకాశాలు ఉన్నాయని చాట్ జీపీటి అంచనా వేసింది. అదే సమయంలో గతం కంటే బీజేపీ ఓటు షేర్ తగ్గే అవకాశం ఉంది అని తెలిపింది. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్భణం ప్రధాన అంశాలుగా ఉన్నా వీటిని సమర్ధవంతగా వాడుకోవడంలో ప్రతిపక్షాలు ఉపయోగించుకోలేకపోయాయని అభిప్రాయపడింది. కొన్ని సవాళ్లు ఉన్నా కూడా 2024 ఎన్నికల్లో మోడీ తిరిగి అధికారం నిలబెట్టుకునే ఛాన్స్ ఉంది అని వెల్లడించింది. అయితే బీజేపీ తెలంగాణాలో ఒంటరిగా పోటీ చేస్తే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో పొత్తు కారణంగా బీజేపీ తన పరిస్థితిని కొంత మెరుగుపరచుకునే ప్రయత్నం చేసింది అని వెల్లడించటం విశేషం. చాట్ జీపీటి తనకు అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించింది. అంతే తప్ప ఇవి పక్కాగా నిజం అవుతాయి అని చెప్పలేం..అలాగని పూర్తిగా తప్పు అని చెప్పటానికి కూడా లేదు. ఇవి కేవలం అంచనాలకు మాత్రమే. గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లు గెలుచుకుంది. ఈ సారి ఆ ఛాన్స్ లేదు అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట.