కేంద్రం టార్గెట్ చంద్రచూడ్!

Update: 2023-01-16 08:36 GMT

కేంద్రం వర్సస్ సుప్రీం కోర్ట్ మధ్య పోరు కొత్త మలుపు తిరిగింది. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీ వై చంద్రచూడ్ వచ్చిన తర్వాతే కేంద్రం దూకుడు పెంచినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతం లో అంటే ఎన్ వీ రమణ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఉన్నప్పుడు లేని సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయనే చర్చ కూడా సాగుతోంది. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న చంద్రచూడ్ కు చాలా మంచి పేరు ఉంది. వాక్సినేషన్ విషయంలో కూడా అయన బెంచ్ తీర్పు తర్వాత కేంద్రంలోని మోడీ సర్కారు వెంటనే ఫ్రీ వాక్సినేషన్ పై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. చంద్రచూడ్ నిజాయతి, నిబద్దత కూడిన వ్యక్తిగా పేరుంది. ఆయనపై వత్తిడి తెచ్చేందుకే కేంద్రం ఇలా చేస్తుంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా ఎన్నడూ లేని రీతిలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ , కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు న్యాయవ్యవస్థపై ఎటాక్ చేస్తున్నారు. తాజాగా కిరణ్ రిజిజు తాజాగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు.

                                 దాని సారాంశం ఏమిటి అంటే న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియలో.. హైకోర్టు సుప్రీంకోర్టు కొలీజియంలో ప్రభుత్వ ప్రతినిధులను చేర్చుకోవాలని సూచించారు. న్యాయమూర్తుల నియామకాల రాజ్యాంగ ప్రక్రియలో ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పించాలని సూచించారు. "పారదర్శకత, జవాబుదారీతనం గురించి ప్రజలకు తెలియజేయడం" అవసరమని కిరణ్ రిజిజు ఆ లేఖలో పేర్కొన్నారు. కొలీజియం వ్యవస్థపై కేంద్రం గుర్రుగా ఉంది. అదే సమయంలో ఈ వ్యవస్థ వందకు వంద శాతం పక్కాగా ఉంది అని చెప్పటానికి లేదు కానీ...ఉన్నంతలో కొంత మెరుగ్గానే ఉందనే అభిప్రాయం ఉంది. కొలీజియంలోకి ప్రభుత్వ ప్రతినిధులకు చోటు కల్పిస్తే ఇది మరింత పక్కదారి పట్టే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది. మొత్తానికి ఈ రెండు కీలక వ్యవస్థల మధ్య ఘర్షణ ఎటు వైపు దారితీస్తోందో అన్న చర్చ సాగుతోంది.

Tags:    

Similar News