ఇక నుంచి డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనుక్కోండి
కేంద్ర మంత్రులు ఎయిర్ ఇండియాకు ఉన్న బాకీలు కట్టే పనిలో ఉన్నారు. అన్ని బాకీలు పూర్తి చేసి..ఇక నుంచి టిక్కెట్లు డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రులను కోరింది. ఆర్ధిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం ఈ మేరకు సమాచారం పంపింది. ఎయిర్ ఇండియా ప్రభుత్వం నుంచి టాటాల చేతికి వెళ్లనుండటంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్ లైన్ చేతులు మారే ప్రక్రియ కొనసాగుతుండటంతో ప్రభుత్వానికి అప్పు సౌకర్యాన్ని నిలిపివేశారు. దీంతో ఇప్పటికే ఉన్న బాకీలను చెల్లించి ఇక నుంచి నగదుతో టిక్కెట్లు కొనాల్సిన పరిస్థితి వచ్చింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత కేంద్రం ఎయిర్ ఇండియాను టాటాలకు 18 వేల కోట్ల రూపాయలకు విక్రయించిన విషయం తెలిసిందే.
డిసెంబర్ నాటికి పూర్తిగా ఈ సంస్థ టాటా సన్స్ చేతికి రానుంది. ఇప్పటికే టాటాలకు అప్పగించేందుకు అవసరమైన అనుమతి పత్రాలు అందజేయటం పూర్తి అయింది. ఇతర బదిలీ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే టాటాల చేతిలో విస్తారా ఎయిర్ లైన్స్ తోపాటు ఎయిర్ ఏషియా ఇండియాలు ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్ ఇండియా ఎంట్రీతో దేశీయ విమానయాన మార్కెట్లో ఈ గ్రూప్ అత్యంత కీలక పాత్రపోషించే స్థితికి చేరింది. టాటా సన్స్ తమ పూర్వ సంస్థ అయిన ఎయిర్ ఇండియా రాజసాన్ని తిరిగి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉంది. అయితే అది అంత తేలిక కాదని..దీనికి చాలా కష్టపడాల్సి ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.