ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్ష్యతన కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం అయింది. చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఈ ప్రమాద ఘటన వివరాలను మంత్రివర్గానికి వివరించనున్నారు. అనంతరం ఆయన పార్లమెంట్ లో దీనిపై ప్రకటన చేయనున్నారు. హెలికాప్టర్ ప్రమాదంపై వాయుసేన విచారణకు ఆదేశించింది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం బిపిన్ రావత్ ఈ ప్రమాదంతో తీవ్ర గాయాల పాలు కావటంతో ఆయనకు ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
రావత్ తోపాటు మరికొంత మందిని కూడా ఆస్పత్రికి తరలించారు. బుధవారం మధ్యాహ్నం సమయంలో తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. నీలగిరి ప్రాంతాల్లో ఆర్మీ హెలికాఫ్టర్ కూలిపోయింది. కోయంబత్తూరు-సూలూర్ ప్రాంతాల మధ్య ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ఘటన ప్రాంతాన్ని చూస్తే పరిస్థితి భయానకంగా ఉంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంది.