కులగణన నిర్ణయం వెనక ప్రధాన కారణం అదే !
కేంద్రంలోని మోడీ సర్కారు బుధవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ఏ ప్రభుత్వం అయినా ఒక నిర్ణయం తీసుకుంది అంటే దాని వెనక ఖచ్చితంగా పొలిటికల్ ఎజెండా ఉంటుంది అనే విషయం తెలిసిందే. పైగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న కులగణన నిర్ణయాన్ని ఇప్పుడు మోడీ సర్కారు తీసుకుంది అంటే అది ఆషామాషీగా తీసుకోదు. ఎందుకంటే దీని వెనక లెక్కలు వేరే ఉన్నాయనే చర్చ తెర మీదకు వచ్చింది. కులగణన విషయంలో ఎప్పటి నుంచో మాట్లాడుతున్నది కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్న విషయం ప్రతిఒక్కరికి తెలుసు. ఎవరూ ఊహించని రీతిలో బుధవారం నాడు ప్రధాని మోడీ అద్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో జనగణనతో పాటు కుల గణన కూడా చెప్పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. కులగణన పేరుతో కాంగ్రెస్ సర్వేలు చేయించింది అని అందులో శాస్త్రీయత లేదు అంటూ తెలంగాణాలో జరిగిన కులగణనపై ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు దేశంలో కొత్తగా కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణనే. కేంద్రం త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సమయంలోనే కులగణన కూడా చేపడతామని వెల్లడించారు. ఇది అంతా పారదర్శకంగా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు. దేశంలోని మెజారిటీ ప్రజలకు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉండటం లేదు అని..కొంత మంది మాత్రమే వీటిని ప్రభావితం చేస్తున్నారు అంటూ రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం కులగణన మాత్రమే అని రాహుల్ పార్లమెంట్ సాక్షిగా కూడా ప్రకటించారు.
అలాంటి రాహుల్ గాంధీ కీలక డిమాండ్ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు సానుకూలంగా స్పందించటం వెనక ప్రధాన కారణం ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలే అనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ప్రధానంగా బీహార్ లో వెనకబడిన వర్గాల ప్రభావం ఎక్కువ అనే విషయం తెలిసిందే. జనగణన, కులగణన ఎప్పుడు ప్రారంభం అవుతుంది..ఎప్పుడు పూర్తి ఆవుతుంది అన్నది క్లారిటీ లేదు కానీ..బీహార్ ఎన్నికల్లో ఈ అంశాన్ని వాడుకోవడానికి మోడీ పెద్ద ప్లానే వేసినట్లు ఉంది అనే చర్చ సాగుతోంది. కేంద్రం జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన వెలువడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ ...రాహుల్ గాంధీ విజన్ సాకారం కాబోతుంది అని ప్రకటించారు. కేంద్రం దీనిపై ప్రకటన చేసిందో లేదో కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో క్రెడిట్ క్లెయిమ్ విషయంలో ఏ మాత్రం జాప్యం చేయకుండా రంగంలోకి దిగింది అనే చెప్పాలి. అయితే మోడీ ప్రచారాన్ని తట్టుకుని కాంగ్రెస్ ఇది తమ విజయంగా ఎంతో మేర చెప్పుకోగలదో చూడాల్సిందే.