కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈ క్లాస్ 12 ఎగ్జామ్స్ రద్దు చేశారు. ఈ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలను నిర్దేశిత సమయంలో ప్రకటించనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ సారధ్యంలో సాగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విద్యార్ధుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోడీ వెల్లడించారు. విద్యార్ధుల ఆరోగ్యం, సేఫ్టీ అత్యంత ముఖ్యం అని..ఈ విషయంలో ఏ మాత్రం రాజీపడేది ఉండదన్నారు. తాజా నిర్ణయంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, టీచర్ల ఆందోళన తగ్గుముఖం పడుతుందని పేర్కొన్నారు. ఇంత ఒత్తిడి మధ్య విద్యార్ధులను ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలని బలవంత పెట్టలేమన్నారు.
ఈ విషయంలో భాగస్వాములు అందరూ పరిస్థితిని అర్ధం చేసుకుని ముందుకు సాగాలని మోడీ కోరారు. ఈ నిర్ణయం తీసుకోవటానికి ముందు పలు వర్గాలతో పెద్ద ఎత్తున చర్చలు జరిపినట్లు అధికారులు మోడీకి నివేదించారు. కరోనా రెండవ దశను పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది ఎగ్జామ్స్ నిర్వహించకూడదనే అభిప్రాయానికి వచ్చారు. దేశంలో కరోనా ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు అమలు అవుతున్నాయని..ఈ దశలో విద్యార్దులపై ఒత్తిడి తేవటం సరికాదని తేల్చారు.