పండగల సీజన్ లోనూ పెరగని అమ్మకాలు

Update: 2024-10-07 12:42 GMT

Full Viewపండగల సీజన్ వచ్చింది అంటే చాలా మంది కొత్త కార్లు, కొత్త వాహనాలు కొనుగోలు చేయటానికి మొగ్గు చూపుతారు. పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ సీజన్ ను టార్గెట్ చేసుకుని పలు కొత్త మోడల్స్ ను కూడా మార్కెట్ లోకి విడుదల చేస్తాయి. అంతే కాదు పలు ఆఫర్స్ తో కూడా ముందుకు వస్తాయి. కానీ ఈ సారి మాత్రం లెక్క తేడా ఉన్నట్లు కనిపిస్తోంది. దేశంలో పండగ సీజన్ మొదలైనా కూడా ఆటోమొబైల్ అమ్మకాలు ఏ మాత్రం ఊపు అందుకోవటం లేదు. ఇది అలా ఉంచి అమ్మకాలు తగ్గుముఖం పట్టడం ఆటోమొబైల్ రంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం దేశంలో అమ్ముడు పోని కార్లు ఎన్నడూ లేని రీతిలో రికార్డు స్థాయి 7 .9 లక్షలకు చేరాయి. ఈ మొత్తం కార్ల విలువ 79 వేల కోట్ల రూపాయలు ఉంటుంది అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఏడిఏ) వెల్లడించింది.

                                    2024 సెప్టెంబర్ లో ఆటోమొబైల్ అమ్మకాలు మొత్తం మీద తొమ్మిది శాతం పైగా తగ్గుముఖం పట్టాయి. ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 10 శాతంపైగా తగ్గగా, గత ఏడాది సెప్టెంబర్ తో పోలిస్తే ఈ తగ్గుముఖం దగ్గర దగ్గర 19 శాతం ఉంది. ప్రధానంగా ప్యాసింజర్ వాహనాల విషయంలోనే ఇన్వెంటరీలు పెరిగిపోతున్నట్లు డీలర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. గణేష్ చతుర్థి, ఓనం పండగల సమయంలో ఆశించిన స్థాయిలో అమ్మకాలు పెరగలేదు అని డీలర్స్ అసోసియేషన్ చెపుతోంది. సెప్టెంబర్ నెలలలో ద్విచక్ర వాహనాల తో పాటు వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. కీలక పండగల సమయం అయిన అక్టోబర్ లో ఆశించిన స్థాయిలో అమ్మకాలు పెరగకపోతే అమ్ముడు పోని వాహనాలు పేరుకుపోయి డీలర్లు తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెపుతున్నారు.

Tags:    

Similar News