విద్యార్ధులకు...పర్యాటకులకూ గుడ్ న్యూస్. భారత్ నుంచి ఇక నేరుగా కెనడా వెళ్లొచ్చు. ఇప్పటివరకూ భారత ప్రయాణికులు వేరే దేశం ద్వారానే కెనడాలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తూ వచ్చారు. అయితే సెప్టెంబర్ 27 నుంచి భారత్ నుంచి విమానాలను నేరుగా అనుమతిస్తున్నట్లు కెనడా వెల్లడించింది. దీంతో విద్యార్ధులు..ఇతర ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. ఐదు నెలల విరామం తర్వాత కెనడా భారత్ నుంచి డైరక్ట్ ఫ్లైట్స్ కు అనుమతి మంజూరు చేసింది. అయితే భారత్ నుంచి వెళ్ళే ప్రయాణికులు విధిగా నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రయాణానికి 18 గంటల ముందు ఈ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. భారత్ లోని న్యూఢిల్లీ విమానాశ్రయం నుంచి ఎయిర్ కెనడా విమానం తొలి డైరక్ట్ ఫ్లైట్ గా ఉండనుంది.
భారత్-కెనడాల మధ్య తిరిగి విమాన సర్వీసులను పునరుద్ధరించాలని నిర్ణయించటం పట్ల ఒట్టావాలోని భారత హై కమిషనర్ అజయ్ బిసైరా హర్షం వ్యక్తం చేశారు కరోనా రెండవ వేవ్ కారణంగా ఏప్రిల్ లో కెనడా భారత విమానాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. తొలి విమానం కెనడాకు చెందినది కాగా..సెప్టెంబర్ 30 నుంచి ఎయిర్ ఇండియా తన సర్వీసులు ప్రారంభింనుంది. ఇటీవల భారత్ నుంచి పలువురి ప్రయాణికులకు టెస్ట్ లు నిర్వహించగా..వారి ఫలితాలు నెగిటివ్ గా రావటంతోనే తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.