బైజూస్ ఐపీఓ కు రాకపోయినా పెద్ద ఎత్తున విదేశీ సంస్థల నుంచి నిధులు సమీకరించింది. మరో ఫిన్ టెక్ కంపెనీ పేటిఎం కూడా ఇప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. దీనికి కారణం ఆర్ బిఐ నిర్దేశించిన నియమ నిబంధనలను ఈ సంస్థ సరిగా పాటించక పోవటమే. ఈ కారణంగానే ఇటీవల ఆర్ బిఐ పేటి ఎం పే మెంట్స్ బ్యాంకు పై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి పేటి ఎం షేర్లు స్టాక్ మార్కెట్ లో కుప్ప కూలి ఇన్వెస్టర్లు వేల కోట్ల రూపాయల మేర నష్టపోయారు. పేటిఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా 18300 కోట్ల రూపాయలు సమీకరించింది. ఒక్కో షేర్ ను 2150 రూపాయలకు జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు పేటిఎం షేర్లు ఆఫర్ ప్రైస్ ను దాట లేదు. తాజాగా ఆర్ బిఐ విధించిన ఆంక్షలతో ఈ షేర్ కొత్త కనిష్ట స్థాయి 369 రూపాయలకు చేరుకొని...ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకొంటోంది. అయితే పేటిఎం ఈ సమస్యల నుంచి ఎప్పటికి బయటపడుతుంది అనే విషయంలో మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు. ఈ ఫిన్ టెక్ స్టార్టప్ కూడా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఇప్పుడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది అనే విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు పేటిఎం లో చైనా పెట్టుబడులు ఉన్నాయనే విమర్శలు రాగా ..యాజమాన్యం దీన్ని ఖండిస్తూ వస్తోంది. ఈ సమస్యల నుంచి పేటిఎం బయటపడటం అంత ఈజీ గా జరుగుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. ఇప్పటికైతే ఆర్ బిఐ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదు అనే సంకేతాలు పంపుతోంది. ఇలా దేశంలో సంచలన విజయాలు దక్కించుకున్న స్టార్టప్ లు బైజూస్, పేటి ఎంలు ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి.వీటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అయినా మిగిలిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.