కోవాగ్జిన్ వ్యాక్సిన్ డీల్ పై బ్రెజిల్ లో విచార‌ణ‌

Update: 2021-06-23 05:58 GMT

భార‌త్ బ‌యోటెక్ కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ మొద‌టి నుంచి వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. భార‌త్ లోనూ మూడ‌వ ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్తి కాకుండానే అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వ‌టంపై అప్ప‌ట్లో రాజ‌కీయంగా పెద్ద దుమార‌మే రేగింది. దీనికి తోడు ధ‌ర విష‌యంలోనూ భార‌త్ బయోటెక్ సీఎండీ క్రిష్ణ ఎల్లా చెప్పింది ఒక‌టి చేసింది మ‌రొక‌టి. దీంతోపాటు ఈ వ్యాక్సిన్ ఇంకా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్ వో) అత్య‌వ‌వ‌స‌ర వినియోగ జాబితా (ఈయూఎల్)లో చోటుద‌క్కించుకోవ‌టంలో జాప్యం అవుతుండ‌టంతో ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారు ఇత‌ర దేశాల‌కు వెళ్లాలంంటే ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తోంది. తాజాగా ఈ ప‌క్రియ ఊపందుకుంది. అయితే భార‌త్ బ‌యోటెక్ ను కొత్త వివాదం చుట్టుముట్టింది. వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సి్న్ల కొనుగోలుకు సంబంధించి భార‌త్ బ‌యోటెక్ తో కుదిరిన ఒప్పందంపై బ్రెజిల్ విచార‌ణ జ‌ర‌పనుంది. 20 మిలియ‌న్ల డోసుల స‌ర‌ఫ‌రాకు గాను 320 మిలియ‌న్ డాల‌ర్లు చెల్లించేందుకు వీలుగా ఒప్పందం చేసుకున్నారు. ఈలెక్కన ఒక్కో వ్యాక్సిన్ డోసుకు 15 డాల‌ర్లు అవుతుంది.

ఇత‌ర కోవిడ్ 19 వ్యాక్సిన్ల‌తో పోలిస్తే ఈ ధ‌ర ఎక్కువ‌గా ఉంద‌ని నిర్ధారించుకున్నారు. అంతే కాకుండా బ్రెజిల్ లో భారత్ బ‌యోటెక్ త‌ర‌పున మ‌ధ్య‌వ‌ర్తిగా ఉన్న సంస్థ ప్రెసిసా మెడికామెంటోస్ చ‌రిత్ర కూడా ప‌లు సందేహల‌ను లేవ‌నెత్తుతోంది. ఈ సంస్థ గ‌తంలో బ్రెజిల్ ఆరోగ్య శాఖ‌తో ఒప్పందాలు చేసుకుని అస‌లు మందులు స‌ర‌ఫ‌రా చేయ‌లేద‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది. అయితే ఈ వివాదంపై ప్రెసిసా మెడికామెంటోస్ స్పందిస్తూ కోవాగ్జిన్ వ్యాక్సిన్ కొనుగోలుకు సంబంధించి 13 దేశాలు అంగీక‌రించిన ధ‌ర‌కే తాము ఒప్పుకున్నామ‌ని..అంతా పార‌ద‌ర్శ‌కంగా చేశామ‌ని చెబుతోంది. అయితే బ్రెజిల్ ఆరోగ్య మంత్రి మంత్రిత్వ శాఖ ఆమోదం రాక‌ముందే వ్యాక్సిన్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నార‌ని..అంతే కాకుండా అప్ప‌టికే అంత కంటే త‌క్కువ ధ‌ర‌కు మార్కెట్లో వ్యాక్సిన్లు ఉన్నాయ‌ని ఫెడ‌ర‌ల్ ప్రాసిక్యూట‌ర్ లూసినా పేర్కొన్నారు. ప్రెసికా మెడికామెంటోస్ గ‌త చ‌రిత్ర‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని అన్న కోణాల్లోనూ విచార‌ణ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌రి ఈ కొత్త వివాదం ఎన్ని మ‌లుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. ఈ అంశంపై జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

Tags:    

Similar News