అక్కడ మళ్లీ లాక్ డౌన్

Update: 2021-01-05 05:02 GMT

ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు నమోదు అవుతున్న బ్రిటన్ కొత్త వైరస్ తో మరింత సంక్షోభంలోకి కూరుకుపోనుంది. కొత్త స్ట్రెయిన్ తో వైరస్ కేసులు, మరణాల సంఖ్య అంత కంతకూ పెరుగుతోంది. దీంతో ఇంగ్లాండ్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. లాక్‌డౌన్‌ నిబంధనలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రాథమిక, సెకండరీ స్థాయి పాఠశాలలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అత్యవసరాలు, నిత్యావసరాల కోసం మాత్రమే నిర్దేశిత సమయంలో బయటకు వెళ్లాలని, వీలైనన్ని రోజులు వర్క్‌ ఫ్రం హోమ్‌ వెసలుబాటు కల్పించాలని ఆదేశించారు. ఇక సోమవారం 27 వేల మంది కోవిడ్‌తో ఆస్పత్రిలో చేరారని, తొలి దశతో పోలిస్తే సెకండ్‌వేవ్‌లో 40 శాతం మేర ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయని బోరిస్‌ జాన్సన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. గత మంగళవారం అయితే 24 గంటల్లోనే ఏకంగా 80 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, పరిస్థితి చేయి దాటిపోకముందే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు.

అందుకే దేశమంతా పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. ''ఇప్పటికే దేశవ్యాప్తంగా కఠినతరమైన నిబంధనలు అమలు చేస్తున్నాం. కానీ కొత్త రకం వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అది మాత్రమే సరిపోదు. వ్యాక్సిన్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేంతవరకు మరింత అప్రమత్తంగా ఉండాలి'' అని బోరిస్‌ జాన్సన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బ్రిటీష్‌ పౌరులను కాపాడుకునేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తామని, అయితే అందుకు మీ సహకారం కూడా కావాలని, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థించారు. ప్రధాని ప్రసంగం ముగిసిన తర్వాత ఇంగ్లండ్‌ స్కాట్లాండ్‌, వేల్స్‌, ఉత్తర ఐర్లాండ్‌ మెడికల్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్లు వైరస్‌ వ్యాప్తికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. దేశంలో మహమ్మారి విజృంభణ ఉధృతమైందని, ఐదో లెవల్‌కు చేరుకుందని పేర్కొన్నారు. 21 రోజుల్లో పరిస్థితి అదుపులోకి రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, కాబట్టి ముందే జాగ్రత్త పడటం మేలు అని హెచ్చరించారు.

Tags:    

Similar News