మరో బోయింగ్ విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజన్ లో మంటలు వచ్చాయి. పైలట్లు ఈ విషయం గ్రహించి విమానాన్ని వెంటనే ల్యాండ్ చేయటంతో పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ఈ ఘటన అమెరికా లో జరిగింది. డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్ 767 -400 విమానం లాస్ ఏంజెల్స్ నుంచి అట్లాంటా కు బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విమానంలోని ఎడమ ఇంజన్ లో మంటలు వచ్చిన విషయాన్ని చూసిన ఇందులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. పైలట్లు చాకచక్యంగా ఈ విమానాన్ని ల్యాండ్ చేయటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానం ల్యాండ్ అయిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి ఇంజన్ లో చెలరేగిన మంటలను ఆర్పారు. అమెరికా కు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. ఈ ప్రమాద విషయాన్ని డెల్టా ఎయిర్ లైన్స్ కుడి ధృవీకరించింది. అయితే ఈ విమానంలో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారనే విషయం మాత్రం బహిర్గతం కాలేదు.
ఈ ఏడాది జూన్ 12 న ఎయిర్ ఇండియా కు చెందిన బోయింగ్ 737 డ్రీం లైనర్ విమానం కుప్పకూలిన ఘటనలో ఒక్కరు తప్ప ఇందులో ఉన్న ప్రయాణికులు అందరూ చనిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బోయింగ్ విమానాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి వెల్లడైన ప్రాధమిక నివేదికపై కూడా పైలట్ లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కంపెనీ లోపాలను కప్పిపెట్టేలా పైలట్స్ పై ఆరోపణలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత కూడా పలు బోయింగ్ విమానాల్లో సాంకేతక సమస్యలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు డెల్టా ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఇంజన్ లో మంటలు చెలరేగాయి. గతంలోనే బోయింగ్ విమానాల్లో ఫ్యూయల్ స్విచ్ ల్లో సమస్యలు ఉన్నట్లు ఎఫ్ఏఏ గుర్తించినట్లు కూడా వార్తలు వచ్చాయి.