అంతరిక్ష పర్యాటకం అందుబాటులోకి వచ్చే రోజులు దగ్గరొకొచ్చేశాయి. అమెరికా కేంద్రంగా వరసగా అంతరిక్ష యాత్రలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకోగా...ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు అయిన జెఫ్ బెజోస్ కు చెందిన సంస్థ బ్లూ ఆరిజన్ చేపట్టిన అంతరిక్ష పర్యటన కూడా విజయవంతంగా ముగిసింది. జెఫ్ బెజోస్ తోపాటు మరో ముగ్గురితో కూడిన న్యూ షెపర్డ్ అంతరిక్ష టూర్ ను విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చింది. అతి తక్కువ వ్యవధిలో రెండు అంతరిక్ష యాత్రలు విజయవంతం కావటంతోనే త్వరలో వాణిజ్యపరమైన సేవలు అందబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు న్యూ షెపర్డ్ వ్యోమ నౌక నింగిలోకి దూసుకెళ్లింది.వ్యోమ నౌకలో జెఫ్ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు. ఆలివర్ డేమెన్ రోదసీలోకి వెళ్లి వచ్చిన అతి పిన్న వయసు వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.
అంతకుముందు 1961 లో సోవియట్ యూనియన్ ప్రయోగించిన వోస్టాక్ 2 మిషన్‌లో 25 ఏళ్ల వయసులో రష్యన్ వ్యోమగామి గెర్మాన్ టిటోవ్ అంతరిక్షానికి వెళ్లిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతేకాకుండా 82 ఏళ్ల వాలీ ఫంక్ అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన అతి పెద్ద వయస్కురాలిగా నిలిచి రికార్డు సృష్టించింది. న్యూ ఫెపర్డ్ నౌక భూమి నుంచి అంతరిక్షంగా భావించే ఖర్మాన్ లైన్‌ను దాటి 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. న్యూ షెపర్డ్ నౌకకు ఉపయోగించిన రియూజబుల్ బూస్టర్ సురక్షితంగా లాంచింగ్ స్టేషన్‌లో చేరుకుంది. వ్యోమనౌక మాడ్యూల్ లో ప్రయాణిస్తున్న నలుగురి బృందం అంతరిక్ష యాత్రను ముగించుకొని సురక్షితంగా భూమిని చేరుకుంది.జెఫ్ బెజోస్ 2000 సంవత్సరంలో ఈ బ్లూ అరిజన్ సంస్థను నెలకొల్పారు. ఈ సంస్థ ప్రస్తుతం న్యూ గ్లెన్ అనే భారీ రాకెట్ ను డెవలప్ చేసే పనిలో ఉంది.