దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం నాడు మదుపర్లకు చుక్కలు చూపించింది. ఒక్క రోజులో 7.5 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరి అయిపోయింది. ప్రారంభం నుంచి మార్కెట్ తీవ్ర నష్టాలను చవిచూసింది. ముగింపులోనూ అదే కొనసాగింది. దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ పుట్టుకొచ్చిందనే వార్తలతో మార్కెట్లు హడలిపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1688 పాయింట్ల నష్టంతో 57107 పాయింట్ల వద్ద ముగిసింది. గత ఏడు నెలల కాలంలో ఇదే భారీ పతనంగా నమోదు అయింది. బీఎస్ఈ సెన్సెక్స్ తోపాటు నిఫ్టీ కూడా 17000 పాయింట్ల దిగువన 1688 పాయింట్ల వద్ద ముగిసింది. ఎంపిక చేసిన ఫార్మా షేర్లు ఒకింత లాభపడగా..రియాల్టీ, మెటల్స్, బ్యాంకులు, ఆటోమొబైల్ రంగాలకు చెందిన షేర్లు అన్నీ పతనం అయ్యాయి.
కీలక షేర్లు అన్నీ భారీ నష్టాలతోనే ముగిశాయి. వాస్తవానికి కరోనా సమయంలోనూ స్టాక్ మార్కెట్లు అనూహ్య దూకుడు చూపించాయి. గతంలో ఎన్నడూ మార్కెట్ వైపు చూడని లక్షలాది మంది కొత్తగా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతోనే స్టాక్ మార్కెట్లోకి పెట్టుబడులు భారీగా పెరిగాయి. సహజంగా సంవత్సరాంతంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ ఐఐ)లు లాబాలు స్వీకరించి..మళ్ళీ కొత్త సంవత్సరంలో తాజా పెట్టుబడులతో ముందుకు వస్తారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎవరు ఎప్పుడు కొనుగోలు చేస్తారో..ఎప్పుడు అమ్ముతారో ఊహించటం కష్టంగా మారింది. మార్కెట్ కదలికలు నిపుణులకు సైతం అందని రీతిలో సాగుతున్నాయి.