అదానీ గ్రూప్..అంతా మోసమే!

Update: 2023-01-25 09:31 GMT

సంచలనం. ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద గ్రూపుగా ఉన్న అదానీ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఒక నివేదిక దేశ పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ దెబ్బకు అదానీ కంపెనీల షేర్ల ధరలు అన్ని భారీగా పతనం అయ్యాయి. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికతో ఒక్కసారిగా మార్కెట్ లో దుమారం చెలరేగింది. రెండేళ్లపాటు పరిశోధించి ఈ నివేదిక సిద్ధం చేసినట్లు హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చెబుతోంది. అదానీ కుటుంభం ఆధీనంలోని విదేశాల్లో ఉన్న షెల్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున అవినీతి, మనీ లాండరింగ్, పన్నుల ఎగవేత వంటివి సాగినట్లు తేల్చింది ఈ నివేదిక. గ్రూప్ లిస్టెడ్ కంపెనీల ద్వారా నిధులను అక్రమ మార్గంలో తరలించినట్లు పేర్కొన్నారు. పన్ను ఎగవేత కు స్వర్గధామ దేశాల్లో ఏర్పాటు చేసిన కంపెనీల ద్వారా ఇది అంతా జరిగింది అని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెల్లడించింది. గత కొన్ని సంవత్సరాలుగా అకౌంటింగ్ ఫ్రాడ్స్ ద్వారా స్టాక్ మానిప్యులేషన్ కు పాల్పడినట్లు తెలిపారు.వేలాది డాక్యుమెంట్స్ పరిశీలించి, కంపెనీ ప్రతినిధుల ఇంటర్వ్యూ లు చేసి...పలు చోట్లకు వెళ్లి ఈ నివేదిక సిద్ధం చేసినట్లు తెలిపారు.

                         తమ నివేదికలోని అంశాలు, తాము కనుగొన్న విషయాలను పట్టించుకోకపోయినా కూడా అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల విలువ చాలా చాలా ఎక్కువగా ఉంది అని ఫోరెన్సిక్ ఫైనాన్సియల్ రీసెర్చ్ కంపెనీ ఈ నివేదికలో పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీల మోసం మొత్తం విలువ లక్ష కోట్ల రూపాయల పైనే ఉంటుంది అని అంచనా. కొద్ది రోజుల క్రితం విదేశీ పెట్టుబడులకు సంబంధించి సెబీ కూడా అదానీ గ్రూప్ నుంచి కేవైసి కోరినట్లు వార్తలు రాగా అప్పుడు కూడా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పతనం అయ్యాయి. ఈ నివేదిక బయటకు వచ్చాక అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 46000 కోట్ల రూపాయల మేర పతనం అయింది. ఈ దెబ్బకు బుధవారం స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలింది. మరి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై ఈ వార్త రాసే సమయానికి అదానీ గ్రూప్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడ లేదు. 

Tags:    

Similar News