అమెరికాలో మళ్ళీ మాంద్యం భయాలు!

Update: 2023-03-27 10:01 GMT

Full Viewఅగ్ర రాజ్యం అమెరికా ను ఒకదాని తర్వాత ఒక సంక్షోభం వెంటాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ద్రవ్యోల్భణం పెరిగి ప్రజల జీవన వ్యయం గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఇప్పుడు అమెరికా ను బ్యాంకింగ్ సంక్షోభం వెంటాడుతోంది. పలు బ్యాంకులు వరుసబెట్టి మూతబడటం తో డిపాజిటర్లు బెంబేలెత్తిపోయారు. ఈ కారణంగా వారు తమ బ్యాంకు ల నుంచి నగదు విత్ డ్రా చేసుకున్నారు. ఫెడరల్ రిజర్వు వెల్లడించిన తాజా లెక్కల ప్రకారం మార్చి 15 నాటికీ బ్యాంకు ల నుంచి ప్రజలు ఏకంగా మన భారతీయ కరెన్సీ లో అయితే ఎనిమిది లక్షల కోట్లకు పైగానే ఉపసంహరించుకున్నారు. దీనికి ప్రధాన కారణం సిలికాన్ వాలీ బ్యాంకు, సిగ్నచర్ బ్యాంకు లు కుప్పకూలటమే.స్విట్జర్ ల్యాండ్ కు చెందిన క్రెడిట్ సూయిజ్ బ్యాంకు కూడా కూడా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇంత పెద్ద ఎత్తున డిపాజిట్ ల ఉపసంహరణ సాగుతుండటంతో బ్యాంకింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

                                       ఈ పరిస్థితి అనిశ్చితికి దారి తీసే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో బ్యాంకింగ్ వ్యవస్థలో నెలకొన్న ఒత్తిడి కారణంగా అమెరికాలో మాంద్యం తలెత్తే అవకాశాలు ఉన్నాయని మిన్నియాపోలిస్ ఫెడ్ ప్రెసిడెంట్ నీల్ కష్కరి ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న సమస్యల వల్ల నిధుల కొరత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నిధుల కొరత పలు రంగాలకు విస్తరించి ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారితీయవచ్చని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని బ్యాంకు లు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో భారత్ కూడా అప్రమత్తం అయింది. దేశ బ్యాంకింగ్ రంగానికి వచ్చిన ఇబ్బంది ఏమిలేదని చెపుతున్నా ఆర్ బీఐ ఇప్పటికే బ్యాంకు లకు పలు సూచనలు చేసింది. 

Tags:    

Similar News